Take a fresh look at your lifestyle.

కైతలాపూర్‌లో విషాదం ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య

ముద్ర కూకట్‌పల్లి :

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కైతలాపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును బలితీసుకున్నాయి. మనస్పర్థల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఒక తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
​స్థానిక సమాచారం ప్రకారం, కైతలాపూర్‌ రాఘవేంద్ర సొసైటీ ప్రాంతానికి చెందిన బానోత్ శ్రావంతి (27) భర్త ప్రవీణ్ తన ఇద్దరు కుమారులూ కార్తీక్ (10) , కౌశిక్ (8) కలిసి నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర
స్థాయిలో వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఈ గొడవలు ముదరడంతో, తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. మొదట తన ఇద్దరు కుమారులకు ఆపై తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు వదిలినట్లు సమాచారం.
​ఇంటి నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వేధింపులే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.