ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. శనివారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
పర్యటనలో భాగంగా బోడబండ తండాలో మంజూరైన 35 ఇళ్లలో 3 ఇళ్లకు, ఎల్లూరు గ్రామంలో మంజూరైన 39 ఇళ్లలో 3 ఇళ్ల నిర్మాణాలకు మంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని అర్హులైన పేదలకు గూడు కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకంను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5,500 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
అనంతరం కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఆధునిక సాంకేతికతతో అంగన్‌వాడీ సేవలను బలోపేతం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు.
తదుపరి పెంట్లవెల్లి, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం మరియు షాదీ ముబారక్ పథకం చెక్కులను అందజేశారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.