రబీ లో నుంచి 1,25,855 మె.టలకు కనీస మద్దతు ధర
తెలంగాణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రబీ సీజన్‌కు తెలంగాణలో 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. ఈ పంటల సేకరణను ధర మద్దతు పథకం కింద చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 29,860 మెట్రిక్ టన్నుల శనగలు, 37,020 మెట్రిక్ టన్నుల మినుములు, 55,285 మెట్రిక్ టన్నుల వేరుశనగ, 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు కొనుగోలు చేయనున్నారు. ఈ సేకరణ విలువ రూ. 894 కోట్లకు పైగా ఉంటుంది. రైతులను మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షించి వారి కష్టానికి తగిన పూర్తి ధర లభించేలా చూడటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ ఆమోదంతో తెలంగాణ రైతులు పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తికి కొత్త ఉత్తేజం లభిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రైతు చేసిన కష్టానికి తగిన గౌరవం, విలువ దక్కాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. కేంద్రం రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఈ నిర్ణయంతో రైతులు ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదని తద్వారా వారికి అటు ఊరట ఇటు ఆర్థిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో శనగలు, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసే రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగంలో స్థిరత్వం, భద్రత, సమృద్ధికి ఒక కొత్త దిశను నిర్దేశిస్తుంది.