మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు త్రీవ అన్యాయం * ఆరు గ్యారంటీలు,11 డిక్లరేషన్లు అన్నీ మోసమే
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బాసు హన్మంతు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం రూ. 3,24,234 కోట్ల బడ్జెట్లో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం రూ. 12,511 కోట్లు, అంటే సుమారు 3.8 శాతం మాత్రమే కేటాయించడం బీసీల గొంతుకోసినట్లేనని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచి వారి బ్రతుకులు మారుస్తామని చెప్పిన ప్రభుత్వం, వాటిని పెంచకపోగా తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికలు అన్యాయం నిర్వహించడం ద్వారా మరింత చేసిందన్నారు.
రాష్ట్రంలో సంపద సృష్టించేది, ఉత్పత్తి చేసేది బీసీలేనని, సగానికి పైగా పన్నులు కూడా బీసీలే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వర్గానికి కేవలం 3.4 శాతం నిధులు కేటాయించడం ఎలా న్యాయమని ప్రశ్నించారు. “అప్పులేమో బీసీలకు -సంపదేమో అగ్రవర్ణాలకా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ అంకెల గారడీ తప్పా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని బాసు హనుమంతు నాయుడు విమర్శించారు. ఎస్సీ ఎస్టీలు, బీసీ, మైనారిటీలకు ఈ బడ్జెట్ న్యాయం చేయలేదు అని అన్నారు. .తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ అంతా పచ్చి అబద్దాల పుట్ట అని ఆయన అభివర్ణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు గద్వాల జిల్లాకు ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. రూ.3.24లక్షల కోట్ల భారీ బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్పా క్షేత్రస్థాయిలో రైతులు, పేదలకు పైసా ప్రయోజనం లేదని, బడ్జెట్ మొత్తం ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసమే ఉందని ఆరోపించారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు ఉపయోగపడే నెట్టెంపాడు, బీమా, జూరాల ప్రాజెక్టు పెండింగ్ పనులకు, కాల్వల ఆధునీకరణకు బడ్జెట్లో పైసా కేటాయించలేదన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నా జిల్లా ప్రాజెక్టులపై వివక్ష చూపించారని ఆరోపించారు. సాగునీటి రంగానికి ఇచ్చిన రూ.22,615 కోట్లు కేవలం పాత బకాయిలకే సరిపోతాయన్నారు. కొత్త ఆయకట్టుకు నీరు అందించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఎకరాకు రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని ఓట్లు వేయించుకొని ఇప్పుడు బడ్జెట్లో కేవలం రూ.18వేలకోట్లు కేటాయించడం రైతులను దగ్గా చేయడమే అన్నారు..తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో విడుత నిధుల గురించి బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వసనీయత, విజన్ లేదన్నారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెడితే, కాంగ్రెస్ పాలనలో తెలంగాణను తిరోగమనంలోకి నెట్టేశారు అని మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం కాగితపు లెక్కలతో కాలక్షేపం చేస్తుందని విమర్శించారు…
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు జి.రాఘవేంద్ర రెడ్డి, సూర్య గౌడ్, పటేల్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు చంటన్న,గువ్వల గోపాల్, జగదీష్, చిత్తారి కిరణ్, భాస్కర్, రాము, నరసింహులు, అప్సర్, రాజు, రఘు, తదితరులు పాల్గొన్నారు.