పనిచేయలేకపోతే వెళ్లిపోండి …..
చివరి గింజ వరకు కొనాలి …
ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సమీక్ష
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా…?
పనిచేయలేకపోతే వెళ్లిపోండని అధికారులపై ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ లీవ్ పెడితే ఇంచార్జీ ఎవరికిచ్చారని ప్రశ్నించారు. రైతులు ధాన్యం కొనాలని రోడెక్కుతున్నారు. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. కథలు చెప్పొద్దు.. రైతుల కష్టాలు తీర్చండంటూ అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్రంగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయిన వాహనాలు, హమాలీల కొరత, ట్రాన్స్‌పోర్ట్ సమస్యలు తీర్చాలని ఆదేశించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మిల్ పాయింట్ల వద్ద గంటల కొద్దీ ట్రాక్టర్లు, లారీలు నిలిపేస్తున్నారు. రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చే పని అన్నారు. హమాలీల కొరత కారణంగా అన్‌లోడింగ్ నెమ్మదిగా జరుగుతోందని అధికారులు చెప్పగా, అది మీ బాధ్యత కాదా? ముందే ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అంటూ నిలదీశారు. సమావేశంలో కలెక్టర్ గైర్హాజరు అంశం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కలెక్టర్ సెలవులో ఉంటే ఇంచార్జీ అధికారి ఎవరు ప్రజల సమస్యలు చూసే వ్యవస్థ లేకుండా జిల్లా ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు. ప్రజల సమస్యలు వినడానికి కూడా సమయం లేకుంటే ఎలా అన్నారు. ఓ రైతు పెట్రోల్ బాటిల్‌తో కార్యాలయానికి వచ్చిన ఘటనను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రైతుల కోసం 24 గంటలు పనిచేస్తున్నారు. మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. అయినా గ్రౌండ్ లెవెల్‌లో సమస్యలు ఎందుకు తగ్గడం లేదన్నారు. మాకు రైతులే ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. అందుకే ప్రజల తరఫున ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. చివరి గింజ వరకు కొనుగోలు జరగాలి. ట్రాన్స్‌పోర్ట్ విషయంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు.
ట్రాక్టర్ డీసీఎంలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సమావేశం లో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్,, సివిల్ సప్లై డిఎం జగదీశ్, నిత్యానంద్, డి ఎస్పీ ప్రసన్న కుమార్, వ్యవసాయ, డిఆర్డిఏ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు