Take a fresh look at your lifestyle.

సజావుగా కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

 

ఇప్పటివరకు 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈఓ రమేష్ కుమార్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈనెల 1వ తేదీ నుండి కొనసాగుతున్న మూల్యాంకన ప్రక్రియలో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాల పరిశీలనను నిశితంగా గమనించారు. మూల్యాంకనంలో పాల్గొంటున్న ఎగ్జామినర్ల పనితీరును సమీక్షించి, ఎలాంటి లోపాలు లేకుండా కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

మార్గదర్శకాల ప్రకారం మూల్యాంకనం జరగేలా పలు సూచనలు చేసిన ఆయన, కేంద్రంలో మౌలిక వసతులు, భద్రతా చర్యలు, రికార్డుల నిర్వహణ, మార్కుల నమోదు విధానాన్ని పరిశీలించారు.

ఇప్పటివరకు జిల్లాలో 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయ్యిందని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయిందని, బయోసైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన జవాబు పత్రాల డీకోడింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పారు.

మొత్తం 1,36,291 జవాబు పత్రాలు జిల్లాకు అందాయని, ఈనెల 13న జరగనున్న సోషల్ సబ్జెక్టు పరీక్ష అనంతరం మిగిలిన పత్రాలు రానున్నట్లు డీఈఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కురుమయ్య, రాజశేఖర్ రావు, లతదేవి, సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ల శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.