పకడ్బందీగా ఎన్నికలు

పకడ్బందీగా ఎన్నికలు
  • నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది
  •  స్క్రూటినీ తర్వాత పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తాం
  • సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం
  • జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ :  ఈ నెల 30న నిర్వహించే ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ సీతారాంతో కలిసి మాట్లాడారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కావాల్సిన శిక్షణా తరగతులు ఇప్పటికే విడుతల వారీగా పూర్తి చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది ప్రతి పనిని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు ఎప్పటికీ అప్పుడు  క్షేత్ర స్థాయిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. 


మూడు స్థానాలకు 99 నామినేషన్లు..
జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌‌, పాలకుర్తి మూడు నియోజకవర్గాలకు 99 నామినేషన్లు దాఖలైనట్టు కలెక్టర్‌‌ శివలింగయ్య వివరించారు. జనగామ 32, స్టేషన్‌ఘన్‌పూర్‌‌ 28, పాలకుర్తి 39 నామినేష్లు వచ్చినట్టు చెప్పారు. ఇందులో జాతీయ, రాష్ట్రీయ పార్టీల నుంచి 17 మంది, రిజిస్టేషన్‌ పార్టీల నుంచి 35 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 47 మంది నామినేషన్‌ వేసినట్టు వివరించారు. స్ర్కూటినీ తర్వాత ప్రధాన పార్టీలకు వారికి సంబంధించిన గుర్తులు, మిగతా ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించనట్టు తెలిపారు. అదేవిధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం బ్యాలెట్‌ పత్రం ఉంటుందన్నారు. ముందుగా ప్రధాన పార్టీలు ఆ తర్వాత మిగతా వారి పేరు ఆల్ఫాబెటికల్‌ ప్రకారం ముద్రిస్తామని తెలిపారు. 


జిల్లాలో 1706 పోలింగ్‌ స్టేషన్లు..
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 1706 పోలీలింగ్‌ స్టేషన్లు ఉన్నట్టు డీసీపీ సీతారాంం తెలిపారు. జనగామలో 830, స్టేషన్​ఘన్‌పూర్‌‌ 442, పాలకుర్తిలో 434 పోలింగ్‌ బూత్‌లు ఉన్నయని వివరించారు. ఇందులో 436 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ సెంటర్లు గుర్తించినట్టు చెప్పారు. ఈ సెంటర్లలో ప్రత్యే నిఘా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాకు రెండు కంపెనీల బీఎస్‌ఎఫ్‌ బలగాలు వచ్చాయని, ఇంకొ కంపెనీ బలగాలు కూడా రానున్నాయని తెలిపారు. జిల్లాలో 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు రూ.2.60 కోట్ల నగదు, రూ.3 కోట్ల బంగారం సీజ్‌ చేశామని వివరించారు. జిల్లాలో దాదాపు 2,047 మందిని బైండోవర్‌‌ చేశామని, ఇందులో 194 మంది రౌడీ షీటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద ఉన్న 16 లైసెన్స్‌ వెపెన్స్‌ను స్వాధీన పర్చుకున్నట్టు వివరించారు. మొత్తానికి ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు డీసీపీ తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్‌ ఏవో రవీందర్​, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.