శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్
తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ గట్టి షాకిచ్చింది. ఆధునికీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దెను భారీగా పెంచేసింది. ఈ నిర్ణయంపై సామాన్య, మధ్య తరగతి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వ్యాప్తంగా అన్ని పాత వసతి కేంద్రాలను ఆధునికీకరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు 110 కోట్ల రూపాయలతో టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టారు. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు కల్పించి అద్దెను పెంచేశారు. తిరుమలలో దాదాపు ఆరు వేల గదులు ఉన్నాయి. ఇప్పటికే తిరుమలలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా 500, 600 రూపాయల నుంచి 1000 రూపాలయలు పెంచేశారు. ఈనెల ఒకటో తేదీ నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్ లోని 1, 2, 3లో గదులను 150 రూపాయల నుంచి జీఎస్టీతో కలిపి 1700 రూపాయలను చేశారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ నాలుగులో ఒక్కో గదిని 750 రూపాయల నుంచి 1700 రూపాయలకు పెంచారు.
కార్నర్ సూట్ ను జీఎస్టీతో కలిపి రూ.2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్ ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్ నగదుతో కలిపి 3400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలపై సామాన్య భక్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తుల కోణంలో చూడాలని కోరుతున్నారు. అద్దెను వీలయినంత వరకు తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకు అతిథి గృహాల ధరలను పెంచిన టీటీడీ.. సాధారణ భక్తులు ఎక్కువగా వసతి పొందే రూ.50 అద్దెతో లభించే ఎన్‌ఎంసీ, ఎస్‌ఎన్సీ, ఏఎన్సీ, హెచ్వీసీ, రూ.100 అద్దెతో అందించే రాంభగీచా, వరాహ స్వామి గెస్ట్ హౌస్, ఎస్‌ఎన్జీహెచ్, హెచ్వీడీసీ, ఏటీసీ, టీబీసీ, సపత్గిరి అతిథి గృహాల్లో కూడా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి గదుల అద్దె పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈనెల 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్లను ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈనెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దర్శన టికెట్లను ఆన్ లైన్ లో జారీ చేసిన విషయం తెలిసిందే.