సీఎం జనజాతర సభ రద్దు

  • కరీంనగర్ లో  గాలివాన బీభత్సం
  • సభా ప్రాంగణంలో కూలిన వేదిక, టెంట్లు
  • వెలిచాలకు కలిసిరాని సీఎం సభలు
  • చాపర్ ప్రయాణానికి అనుమతించని ఎయిర్ వేస్


ముద్ర ప్రతినిధి కరీంనగర్ :కరీంనగర్ లో గాలివాన బీభత్సం సృష్టించడంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభ రద్దయినట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావలసి ఉండగా కుండపోత వర్షం కారణంగా సభ రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎయిర్ వేస్ అధికారులు చాపర్ ప్రయాణానికి అనుమతి ఇవ్వనట్లు తెలుస్తుంది.  ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో బహిరంగ సభ ప్రాంగణంలో వేసిన వేదికతో పాటు టెంట్లు కూలిపోయాయి. సభ నిర్వహణకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ముఖ్యమంత్రి సభలు కలిసి రావడం లేదు. 

ఈనెల 3 తేదీన సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభకు రేవంత్ రెడ్డి ఆలస్యంగా హాజరయ్యారు. అదే రోజు  కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలిలో నామినేషన్ దాఖలుకు రేవంత్ రెడ్డి హాజరుకావాలని ఆహ్వానించడంతో హుటాహుటిన ఉత్తరప్రదేశ్ కు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జరగాల్సిన సభ సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించడంతో జనాలు ఒకింత  నిరాశకు లోనయ్యారు. రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆలస్యంగా సభకు హాజరయ్యారు. కరీంనగర్ సభ సైతం రద్దయింది. దీంతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నిర్వహించిన రెండు ముఖ్యమంత్రి సభలు వెలిచాల రాజేందర్ రావు కు కలిసి రాలేదని చెప్పవచ్చు.