బోడుప్పల్ కార్పొరేషన్లో 60 శాతం ఆస్తిపన్ను వసూలు

బోడుప్పల్ కార్పొరేషన్లో 60 శాతం ఆస్తిపన్ను వసూలు
  • డిమాండ్ 25.44 కోట్లు... వసూలైంది రూ. 15.43 కోట్లు

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో 60 శాతం మేరకు ఆస్తిపన్ను వసూళ్లు జరిగినట్టు కార్పొరేషన్ రెవెన్యూ అధికారి, మేనేజర్ ఎన్ వి నాగేంద్ర బాబు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 34,326 అసెస్ మెంట్ల ద్వారా 25.44 కోట్ల రూపాయలు వసూలు కావాల్సివుండగా, గత మార్చి 31 నాటికి మొత్తం 15.43 కోట్ల రూపాయలు వసూలైందని వివరించారు. ఇంకా 40 శాతం అసెస్ మెంట్ల నుంచి పన్ను వసూలు కావాల్సివుందని, ఇందుకోసం ముమ్మర యత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

   పన్ను చెల్లించని ఇల్లు, వాణిజ్య సముదాయానికి చెందిన యజమానులకు ఫోన్లు చేయడం, మెసేజ్ లు పంపించడం ద్వారా పన్ను చెల్లింపు విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నామని నాగేంద్ర బాబు తెలిపారు. తమ రెవెన్యూ సిబ్బంది ఆస్తిపన్ను చెల్లింపు బకాయిదారుల ఇళ్లకు వెళ్లి మరీ గుర్తు చేస్తున్నారని వివరించారు. పన్ను చెల్లించని ఇంటి యజమానులకు ముందుగా నోటీసు ఇచ్చి, పన్ను చెల్లించకుంటే మంచినీటి పైప్ లైన్ కట్ చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కాకపోతే రేపైనా పన్ను మొత్తం చెల్లించాల్సిందేనని, మీ బకాయిలపై వడ్డీల భారం పడకముందే చెల్లించాలని ఆయన సూచించారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా ఒక 1500 అసెస్ మెంట్లు మొండిబకాయిదారులుగా గుర్తించామని, వారి నుంచి బకాయిల వసూళ్లపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. చాలామందికి పన్ను చెల్లింపునకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడం, అలాగే పలు చోట్ల  మదింపులో లోపాల కారణంగా అధికపన్ను చెల్లించాల్సి రావడం వంటి కారణాలతో కొంతమంది బకాయిదారులు ముందుకు రావడం లేదని తెలిపారు. త్వరలో జరగనున్న పన్ను రివిజన్ సందర్భంగా ఆయా లోపాలన్నింటినీ సరిచేస్తామని నాగేంద్ర బాబు తెలిపారు. కమిషనర్ జి.రామలింగం ఆదేశాల మేరకు తమ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆస్తిపన్ను వసూళ్లలోనే తలమునకలై వున్నారని ఆయన వివరించారు. బకాయిలను త్వరిత గతిన వసూలు చేయడానికి తమ సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.