ఆ పోరాటం యాదికుంది

ఆ పోరాటం యాదికుంది
  • ఆర్డీఎస్ ను తన్నుకు పోవాలనుకున్నరు
  • జోగులాంబ తల్లికి దండంబెట్టి పాదయాత్ర జేసిన
  • నాడు ఉమ్మడి పాలమూరు హృదయ విదారకం
  • 14 రోజులకు ఒకసారే తాగునీరు దొరికేది
  • అప్పటి నాయకులు జిల్లాకు చేసిందేమీ లేదు
  • నేడు సాగునీటితో కళకళలాడుతోంది
  • వలసలు తగ్గి మన దగ్గరకే వలస వస్తున్నరు
  • గద్వాల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

ముద్ర ప్రతినిధి, జోగులాంబ గ‌ద్వాల: ‘ఆర్డీఎస్ కాల్వను మ‌న‌కు కాకుండా జేసి గ‌ద్దల్లా త‌న్నుకుపోతే ఉద్యమంలో మొట్టమొద‌టి పాద‌యాత్ర చేప‌ట్టింది నేనేనని’ సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ త‌ల్లికి దండం పెట్టి గ‌ద్వాల వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టానని గుర్తు చేసుకున్నారు. గ‌ద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, క‌లెక్టరేట్, ఎస్పీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన అనంత‌రం అయిజ రోడ్డులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో అలంపూర్, గ‌ద్వాల్, న‌డిగ‌డ్డలో నడిచాను. నాడు హృద‌య‌ విదారక దృశ్యాలు క‌న‌బ‌డ్డాయి. క‌న్నీళ్లు పెట్టుకున్నాం. ఇక్కడ స‌భ పెడితే ప్రళ‌య గ‌ర్జన‌లాగా వ‌చ్చారు. తెలంగాణ సాధించుకున్న త‌ర్వాత ప‌రిపాల‌న సంస్కర‌ణ‌లు చేసుకున్నాం. అందులో భాగంగా గ‌ద్వాల జిల్లా ఏర్పడింది. రాజ‌భ‌వ‌నాల‌ను త‌ల‌పించే క‌లెక్టరేట్, పోలీసు భ‌వ‌నాలు ప్రారంభించుకున్నాం. జిల్లా ప్రజ‌లు బాగుండాల‌ని జోగులాంబ గ‌ద్వాల జిల్లా అని ఈ జిల్లాకు పేరు పెట్టుకున్నాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 
నెట్టెంపాడు, బీమా ద్వారా సాగునీరు అందుతోందన్నారురు. ‘గ‌ట్టు’ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసుకున్నామని, ఆ ప‌నులు కూడా త్వర‌లోనే పూర్తవుతాయ‌న్నారు. ‘ప్రజ‌ల సంక్షేమం కోసమే పుట్టిన, చ‌నిపోయే వ‌ర‌కు ప్రతి ఒక్కరికి స‌హాయం అందేలా ఆదుకుంటా’ అని వ్యాఖ్యానించారు. గురుకులాలలో గిరిజ‌న‌, ద‌ళిత‌, బీసీ బిడ్డలు బ్రహ్మాండంగా చ‌దువుకుంటున్నారన్నారు.

ఇద్దరూ ఉద్యమకారులే! 
ఉమ్మడి పాల‌మూరు జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరికి ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమ‌కారులే అని కేసీఆర్ తెలిపారు. నిరంజ‌న్ రెడ్డి ఫీల్డ్ మీద‌, శ్రీనివాస్ గౌడ్ టీజీఓ అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగాన్ని కూడా లెక్క చేయ‌కుండా పోరాడారన్నారు. ల‌క్ష్మారెడ్డి కూడా ఉద్యమంలో ప‌ని చేశారన్నారు. ‘పాత పాల‌మూరు జిల్లా ఐదు జిల్లాలుగా మారింది. ఐదు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. క‌ల్వకుర్తి ఎత్తిపోత‌ల‌, నెట్టెంపాడు, కోయిల్‌సాగ‌ర్, బీమా అన్నింటిని పూర్తి చేసుకుని 15 నుంచి 24 ల‌క్షల ఎక‌రాల‌కు నీరు ఇచ్చుకుంటున్నాం. ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం’ అని కేసీఆర్ వివ‌రించారు. కేసీఆర్ క‌న్నా దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు ఈ జిల్లా నుంచి మంత్రులు అయ్యారని, వారి కాలంలో ఏం జరగలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘గ‌ద్వాల‌లో ఉన్నవారు ప్రాజెక్టులు పూర్తి చేయించ‌లేదు. 14 రోజుల‌కు ఒక‌నాడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నీళ్లు దొరికేవి. ఇవాళ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా నీళ్లు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి ప‌థ‌కం లేదు. క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్, అమ్మ ఒడి వంటివి పెట్టుకున్నాం. గ‌తంలో బ‌తుకు లేక మ‌నం వ‌ల‌స‌పోయాం. ఇవాళ క‌ర్నూల్, రాయిచూర్ నుంచి మ‌న వ‌ద్దకు వ‌ల‌స వ‌స్తున్నారు. పాల‌మూరు జిల్లాలో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంది. తెలంగాణ ఏర్పడితే క‌రెంట్ రాదు అని మాట్లాడారు. తుంగ‌భ‌ద్ర బ్రిడ్జి దాటితే 24 గంట‌ల క‌రెంట్ లేదు. ఆ విధంగా చాలా బ్రహ్మాండ‌మైన ప‌నులు చేసుకున్నాం’ అని కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ ఆఫీసు, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ ప్రారంభం 
అంతకు ముందు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. గ‌ద్వాల్ జిల్లా పార్టీ బాధ్యులు బండ్ల కృష్ణమోహ‌న్ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయానికి చేరుకున్న సీఎంకు హోమ్ మంత్రి మహమూద్‌ అలీ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, డీజీపీ అంజనీకుమార్‌ ఘన స్వాగతం పలికారు. రూ.38.50 కోట్లతో దీనిని నిర్మించారు. అనంతరం కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాలలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అబ్రహాం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ వల్లూరి క్రాంతి, అంజయ్య యాద‌వ్, శాట్స్ చైర్మన్ ఆంజ‌నేయులు గౌడ్‌తో పాటు ప‌లువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.