కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం... స్పందించిన కడియం శ్రీహరి

కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం... స్పందించిన కడియం శ్రీహరి
  • కడియం శ్రీహరికి కాంగ్రెస్ కీలక పదవి ఆఫర్ చేసిందంటూ ప్రచారం
  • తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న కడియం శ్రీహరి
  • తనపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆయనకు కీలక పదవిని ఆఫర్ చేసిందని, దీంతో ఆ పార్టీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఆయన స్పందిస్తూ... తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తనపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీని ఎవరూ వీడటం లేదని... పార్టీని... పార్టీలోని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలోకి వెళుతున్నారంటూ ప్రచారం సాగింది. ఆయన అనూహ్యంగా హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.