రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం

  • మంచాల జెడ్పీటీసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి
  • సర్వసభ్య సమావేశం బహిష్కరణ.. రోడ్డుపై బైఠాయింపు

ఇబ్రహీంపట్నం, ముద్ర:-రైతాంగ సమస్యలను పరిష్కరించాలని సమస్యలు వివరిస్తుంటే అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం నిర్వహిస్తామని మంచాల జెడ్పీటీసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశం ప్రారంభం అయిన వెంటనే రైతాంగ సమస్యలను జెడ్పీటీసి నిత్య నిరంజన్ రెడ్డి ఏకరవు పెట్టారు.  రైతుల సమస్యలు వివరిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదని, వారి తీరుకు నిరసనగా సమావేశాన్ని బహిష్కరించారు.

అనంతరం రోడ్డుపై బైఠాయించిన తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన వరి ధాన్యం పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి నేటికీ దాదాపు మూడు నెలలు కావస్తున్నా రైతుల ఖాతాలో  డబ్బులు జమ కాక  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మండల పరిధిలోని 965 మంది రైతులు వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పటికీ కేవలం 200 మందికి మాత్రమే డబ్బులు అందించినట్లు తెలిపారు. మిగతా 765 మందికి ఇంకా అందించలేదని వాపోయారు. గత సంవత్సరం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న తరుణంలో ఆధారాలతో సహా వాహనాలను పట్టించి అధికారులకు అప్పజెప్పిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కష్టపడి పండించిన పంటను దుర్వినియోగం చేస్తూ లాభాలు గడించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని వారి వద్ద నుండి రికవరీ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు మేలు చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఎడ్మ నరేందర్ రెడ్డి, ఎంపీటీసీలు జయానందం, రాందాస్ నాయక్, సర్పంచులు మంగా శ్రీనివాస్ నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి,పాండు వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.