విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి-కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి-కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:వానకాలం సీజన్ ప్రారంభమైన  నేపథ్యంలో వ్యవసాయ శాఖ   సమీక్ష సమావేశం  కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రణాళిక చేపట్టాలని సూచించారు. కల్తీ విత్తనాల నిరోధానికి ప్రతి ఎరువుల, విత్తనాల దుకాణాల సముదాయాన్ని నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుబంధు, రైతు బీమా, పంట వివరాలను నమోదు చేసే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. వరి నాట్లు ప్రారంభమైన నేపథ్యంలో మండల స్థాయిలో సరిపడా ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవ కేంద్రాలు, ప్రైవేటు ఎరువుల దుకాణాల ద్వారా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ ఆశా కుమారి, ఏడిలు, ఎఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

బడుల్లో ఉపాధి పనులు పూర్తి చేయాలి

మన ఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా ఎన్.ఆర్.ఇ.జి.ఎస్  పనులు మంజూరి అయిన పాఠశాలల్లో ఈ నెల ఆఖరు వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిదిలోగల  గ్రామ పంచాయితీ సర్పంచ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మనఊరు - మన బడి మండల స్తాయి నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  టాయిలెట్స్,  కిచెన్ షెడ్, కంపౌండ్ వాల్స్ ను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంచాలని ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధారి రాదాకిషన్, పంచాయితీ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి. డీపీవో సాయిబాబా,  రాజరెడ్డి పాల్గొన్నారు.