వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుందాం

వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుందాం

ముద్ర /వీపనగండ్ల:- పంట పొలాల్లోని వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే భూసారాన్ని పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్ అన్నారు. ముఖ్యమైన ఆహార పంటల్లో వరి పంట ప్రధానమైనదని వరి పంట వ్యర్థాలను అధిక మొత్తంలో తగలబెట్టడం వలన భూమిలోని ముఖ్యమైన పోషకాలను కోల్పోతామని వివరించారు.

రైతులు వరి పొలాలలో ఒక టన్ను వరిగడ్డిని తగలబెట్టడం వల్ల 5.5 కేజీలను నత్రజని, 2.3 కేజీల భాస్వరం, 25 కేజీల పొటాషియం, 400 కేజీ ల సేంద్రియ ఎరువును కోల్పోతున్నామని తెలిపారు. అంతేకాక నేలలో ఉష్ణోగ్రతలు పెరిగి పంటలకు మేలు చేసే క్రిములు చనిపోవడం వలన సేంద్రియ కర్బనం తగ్గిపోతుందని, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అయ్యే వాయుపదార్థాలు ఎక్కువై వాయు కాలుష్యానికి దారితీస్తుందని, అందుకే రైతులు పంట అవశేషాలకు విలువలు జోడించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పంట వ్యర్థాలను పశువుల మేతగా వంట చెరుకు, బయోగ్యాస్, జీవన ఎరువులుగా, కంపోస్ట్ ఎరువు తయారీగా వినియోగించుకోవాలని, మట్టిలో కలియటం ద్వారా భూస్వరం పెరిగి తద్వారా నీటిని నిలువ చేసుకొని సామర్థ్యం పెంచుతుందని, రైతులు ఈ పద్ధతులను పాటించి పంటలో అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్ తెలిపారు.