బోడుప్పల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా

బోడుప్పల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా
  • మేయర్, డిప్యూటీ మేయర్ లపై కాంగ్రెస్ అవిశ్వాసం
  • అధికారం కోల్పోయిన బీఆర్ఎస్
  • కొత్త మేయర్ గా తోటకూర వజ్రేష్ యాదవ్

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నాలున్నరేళ్ల బీఆర్ఎస్ పాలన ఈనెల 29 (శనివారం)తో ముగిసిపోయింది. పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం నెగ్గింది. ఇక మిగిలిన ఆరునెలల కాలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఏలుబడిలోకి రానుంది. కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేటర్లకు గాను, 22 మంది కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి, ప్రస్తుత పాలకవర్గంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బోడుప్పల్ ప్రస్తుత మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ చేతిలోని ఈ కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైంది. మేయర్ గా ఏకగ్రీవంగా తోటకూర అజయ్ కుమార్ యాదవ్ ను కార్పొరేటర్లంతా ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారికంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక త్వరలో జరగనుంది.

సీఎం రేవంత్ రెడ్డికి కానుక: మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి వజ్రేష్ యాదవ్

 బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. కార్పొరేషన్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన కార్పొరేటర్లందరినీ ఆయన అభినందించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇన్నాళ్లకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వతంత్రం వచ్చిందని అన్నారు. 1997 నుంచి 2007 వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నపుడు దేవేంద్ర గౌడ్ నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. గత అయిదేళ్లలో ఈ ప్రాంత మాజీమంత్రి మల్లారెడ్డి, కార్పొరేటర్లు కలిసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పని చేశామని అన్నారు. అంతకుముందే ఎన్నికల సమయంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 29న నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో 22 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పక్షాన నిలిచి కాంగ్రెస్ విజయానికి సహకరించారని చెబుతూ, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

    అంతకుముందు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్తాడుతూ, గత యాభై రోజులుగా కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, అజయ్ యాదవ్, వజ్రేష్ యాదవ్ లు చేస్తున్న ప్రయత్నం ఈ రోజు ఫలించిందని అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించారని అన్నారు. ఈ సమాచారాన్ని కలెక్టర్ కు తెలియపరిచిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. మేయన్ గా తోటకూర అజయ్ యాదవ్ పేరును ఏకగ్రీవంగా అందరూ బలపరుస్తున్నారని, డిప్యూటీ మేయర్ పదవికి ఒకరిద్దరు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారని ఆయన తెలిపారు. మరుసటి సమావేశంలో ఈ రెండు ప్రదవులకు అధికారికంగా అభ్యర్థులను ఎన్నుకుని తెలియపరుస్తామన్నారు.

ఆరునెలల్లో నాలుగున్నరేళ్ల అభివృద్ధి చేస్తాం: మేయర్ గా ఎన్నికకానున్న అజయ్

 బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గత నాలుగున్నరేళ్లుగా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని, వచ్చే ఆరునెలల కాలంలో నాలున్నరేళ్ల అభివృద్ధిని చూపిస్తామని నూతన మేయర్ గా ఎన్నిక కానున్న తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు. మాజీమంత్రి మల్లారెడ్డి గత ప్రభుత్వ హయాంలో బోడుప్పల్ అభివృద్ధికి ఒక్క పైపా నిధులు ప్రభుత్వం నుంచి తీసుకురాలేదని తెలిపారు. గత నలభై రోజులుగా తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తే, కలెక్టరు ఈనెల 6వ తేదీన సమావేశానికి తేదీ ఇచ్చారని తెలిపారు. దీనిపై ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారని, తర్వాత తాము ఆ స్టే ను రద్దు చేయించాక 29న అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సమావేశానికి కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ లను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతులను చేశామని అజయ్ యాదవ్ తెలిపారు. తమకు సహకరించిన కార్పొరేటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమయ్యిందని తెలిపారు. వక్ఫ్ సమస్యతో పాటు, ఇంకా చాలా సమస్యలసై చర్చించాల్సివుందని అన్నారు. వీటన్నింటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  

   శనివారం ఉదయం పదిన్నర గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం 12 గంటల దాకా కొనసాగింది. వందలాదిగా కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూశారు. విక్టరీ సింబల్ చూసిస్తూ బయటకు వచ్చిన కార్పొరేటర్లను చూసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూశారు. కార్పొరేషన్ కార్యాలయం వున్న అంబేద్కర్ సర్కిల్ నుంచి మైసమ్మ గుడిదాకా రోడ్లుపై వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు.