భూమీ ఏదైనా వ్యాపారమే తమ లక్ష్యం....

భూమీ ఏదైనా వ్యాపారమే తమ లక్ష్యం....
  • ప్రభుత్వ భూముల నుండి వెంచర్లకు దారులు....

ముద్ర, ఆలేరు : తమ భూముల వ్యాపారం కోసం ప్రభుత్వ భూములను సైతం వదలకుండా భూ వ్యాపారులు రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామ రెవెన్యూ పరిధిలోని పెద్ద వాగులో నుండి భూ వ్యాపారులు దారి ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని యదేచ్చగా కొనసాగడానికి గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరిస్తూ, తమ వ్యవసాయ భూములకు వెళ్లాలనే సాకుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తున్నారు. నిజానికి తమ వ్యవసాయ భూముల దగ్గరకు రాకపోకలు కొనసాగించాలంటే పది పీట్ల రోడ్డు అవసరం, కానీ రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ముడుపులు పుచ్చుకున్న నేతలు 30 ఫీట్ల రోడ్డు ఏర్పాటు కోసం సహకరించడం గమనార్వహం. మరో సంస్థకు ప్రభుత్వం నుండి పొందిన భూమిలోనుండి సదరు వ్యక్తి దారి ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట గ్రామం లోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 73 నుండి వెంచర్ నిర్వహకులు దారిని ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారం కొనసాగించడాన్ని గుర్తించిన గ్రామానికి చెందిన మక్కల దుర్గయ్య అనేకసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. ఆ వెంచర్ నిర్వాహకుల కోసం గ్రామానికి చెందిన పలువురు తమ వ్యవసాయ భూముల దగ్గరకు వెళ్లడానికి దారి అవసరమని వాదించినప్పటికీ దుర్గయ్య రైతులకు కేవలం 10 పిట్ల రోడ్డు సరిపోతుంది అని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో పది పీట్ల రోడ్డును వదిలి మిగతా రోడ్డును రెవిన్యూ అధికారులు తొలగించాల్సిందిగా లోకాయుక్త ఆదేశించడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో కొంత రోడ్డును తొలగించి, ఈ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దుర్గయ్య 10 పిట్ల రోడ్డుకు వెంచర్ పర్మిషన్ ఎలా ఉంటుందని దానిని రద్దు చేయాలని సంబంధిత అధికారులను, జిల్లా పంచాయతీ అధికారులను కలిసి వారి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు దాటవేత ధోరణితో వ్యవహరిస్తూ పరోక్షంగా వెంచర్ నిర్వాహకులకు సహకరించారని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ భూమి గా ఉన్న బోర్డును శనివారం నాడు  గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడంతో సమస్య మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూముల నుండి దారులు ఏర్పాటు చేసుకొని అనేక వెంచర్ నిర్వాహకులు తమ వ్యాపారాలను యదేచ్చగా కొనసాగిస్తున్న రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని పలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిలదీస్తున్నారు. మక్కల దుర్గయ్య ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సైతం అక్రమంగా ఆక్రమించుకున్న భూమి విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిలో వేసుకున్న బోర్ ను సీజ్ చేయించినప్పటికీ ఆయన తన పలుకుబడితో ఆ భూమిలో నేటికీ సేద్యం చేస్తూనే ఉన్నారు. అనేక విషయాలలో కబ్జాదారులకు వ్యతిరేకంగా చట్టపరంగా పోరాడుతున్న మక్కల దుర్గయ్యపై ముసుగులు ధరించిన వ్యక్తులు హత్యాయత్నం సైతం జరగడం గమనార్హం. వెంటనే అధికారులు స్పందించి, ప్రభుత్వ భూముల నుండి దారులు ఏర్పాటు చేసుకొని భూ వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రామపంచాయతీ అనుమతితో గతంలో వెంచర్లు చేసి ఆ స్థలాన్ని విక్రయించిన నిర్వాహకులు ప్రస్తుతం డిటిసిపి లేఅవుట్ పేరుతో మరోసారి నూతన అనుమతులు పొంది, గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులకు శఠగోపం పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆలేరు మండలం రాఘవపురం గ్రామ పరిధిలో గతంలో విజయవాడకు చెందిన వజ్జే రజని గ్రామపంచాయతీ అనుమతితో ప్లాట్లను ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లాట్ లను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు విక్రయించారు. తిరిగి ఆ భూమిని గ్రామానికి చెందిన కొంతమంది తీసుకొని నూతన కంపెనీ బోర్డును ఏర్పాటు ఏర్పాటు చేశారు. గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు తమ స్థలం ఉందని సదర్ వ్యక్తుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకోకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాయ కష్టం చేసి తమ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులతో ప్లాట్లను కొనుగోలు చేసుకుంటే, అక్రమ భూ వ్యాపారులు ఆ స్థలాలను ఎక్కువ మందికి విక్రయించి నిధువున దోపిడీ చేసిన గుర్తించలేని స్థితిలో కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారు.

గతంలో గ్రామపంచాయతీ అనుమతులతో వెంచర్లను ఏర్పాటు చేసి, తిరిగి ఆ స్థలాలలో నూతన అనుమతుల కోసం వచ్చిన నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు సంబంధిత అధికారులు ఇవ్వద్దని ప్రజలు కోరుతున్నారు. యాదగిరి గుట్ట మండలంలోని పెద్దకందుకూర్ గ్రామంలో సన్ సిటి వెంచర్ నిర్వహకులు హద్దులను దాటి గతంలోని రొడ్డును ఆక్రమించుకొని వెంచర్ ప్లట్లను విక్రయిస్తున్నారు. చిన్నకందుకూర్ స్టేజి సమీపంలో ఉన్న సన్ సిటి వెంచర్ నిర్వాహకులు నక్ష బాటను ఆక్రమించి వెంచర్ ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్రమైన విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలని పలువురు కోరుకుంటున్నారు.