రజాకార్ల రాక్షస పాలనను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా

రజాకార్ల రాక్షస పాలనను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా
  • తెలంగాణ తెగువను, పటేల్ కృషి ని తెలియజేసిన మూవీ
  • కేసీఆర్… ఈ సినిమా చూశాక నిజాం గొప్పోడని ట్వీట్ చేసే దమ్ముందా?
  • ముస్లిం రిజర్వేషన్లు కావాలంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడండి
  • రజాకార్ మూవీ చూసి ఒవైసీ పార్టీ ఎట్లాంటిదో తెలుసుకోండి
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

 ముద్ర ప్రతినిధి కరీంనగర్ : నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను, గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘‘రజాకార్’’. నిజాం నియంత, రజాకార్ల రాక్షసత్వ పాలనపై తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల చరిత్రను అద్బుతంగా తెరపై చూపించారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. ఆదివారం రజాకార్ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ  నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విమోచన కల్పించి మనమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషి మరువలేనిది. ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు కల్పించినా వాటిని అధిగమించి సినిమాను అత్యద్బుతంగా తీసి ప్రజలకు చూపిస్తున్న దర్శక, నిర్మాతలు యాట సత్యనారాయణ, గూడూరు నారాయణరెడ్డిలకు నిజాంగా హ్యాట్సాఫ్ అన్నారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను కళ్లారా చూపించాం. పరకాల, గుండ్రాంపల్లి వంటి గ్రామాల ప్రజల పోరాట స్పూర్తిని ఈ సినిమాలో చూపించారని కొనియాడారు.


కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూశాక ‘రజాకార్’ లాంటి సినిమా తీయాలనే ఆలోచనను నిర్మాత గూడూరు నారాయణరెడ్డితో నేను పంచుకున్నా… అనుకున్నదే తడువుగా దర్శకుడు యాట సత్యానారాయణతో స్క్రిప్టును పూర్తి చేయించి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించడం చాలా గ్రేట్. సినిమా నిర్మాణం సమయంలో, ఆ తరువాత సినిమా విడుదల సమయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్దికంగా ఇబ్బందులు పడ్డా వాటిని దాటుకుంటూ ఈ సినిమాను ప్రజలకు చేరవేయడం ఆనందంగా ఉంది.  ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్బుతంగా నటించారు. ఖాసీంరజ్వీ, రాజిరెడ్డి, సర్దార్ పటేల్ పాత్రల్లో నటించారనే దానికంటే జీవించారని చెప్పొచ్చు. అందుకే మనస్పూర్తిగా సినిమా యూనిట్ సభ్యులందరికీ మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు. పేరుకోసమో, డబ్బు కోసమో కాకుండా వాస్తవాలను, తెలంగాణలో నాడు ప్రజలు పడ్డ గోసను, ఆనాటి చరిత్రను తెలియజేయాలనే ఉద్దేశంతో కష్టాలను ఓర్చి సినిమాను నిర్మించిన దర్శక, నిర్మాతలకు నా ప్రత్యేక అభినందనలు.


 దురదృష్టవశాత్తు  కొన్ని మీడియా సంస్థలు, కొందరు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను ప్రోత్సహించడం లేదు. సినిమా థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. దయచేసి వీటిని వెంటనే చెక్ పెట్టి ఇలాంటి సందేశాత్మక సినిమాల ప్రదర్శనకు అనుమతించాలి. ప్రజలు చూసేలా వీలు కలిగించాలి విజ్ఞప్తి చేశారు. బాధాకరమేందంటే…. ఒక మత వ్యాప్తి కోసం నిజాం, రజాకార్ ఎన్ని అరాచకాలు చేశారో కళ్లారా చూసిన తరువాత కూడా కాంగ్రెస్ పాలకులు ఇంకా ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తాననడం సిగ్గు చేటు. అందుకే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే మా అభిమాతం అని స్పష్టం చేశారు.కొందరు కుహానా లౌకిక వాదులు, నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ వంటి నేతలందరికీ ఈ సినిమా చూపించాలి. ఎందుకంటే నిజాం చేసిన అరాచకాలను, రజాకార్ రాక్షసత్వం వాళ్లకు తెలియాలి. ఏ నోటితో నిజాంను కేసీఆర్ పొగిడారో ఈ సినిమా చూసిన ఆ నోటితో సినిమా గురించి అభిప్రాయాలను ట్వీట్ చేయాలని డిమాండ్ చేశారు.ఇది బీజేపీ కార్యకర్తలు చూడాల్సిన సినిమా కాదు… తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనుకునే వాళ్లు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన సినిమా. 


ప్రత్యేకించి యువతకు నేను విజ్ఝప్తి చేస్తున్నా…. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి. సినిమా చూసిన తరువాత ట్వీట్ చేయాలి. సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం కల్పించాలి. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ, దేశంలోని హిందూవులందరూ ఈ సినిమా చూడాలని కోరారు.
కేసీఆర్ ఎక్కడున్నా ఆయన ‘రజాకార్’ సినిమా చూడాలని కోరుతున్నా. ఆ సినిమా చూసిన తరువాత కూడా నిజాం గొప్పోడు, రజాకార్లు మంచోళ్లని అన్పిస్తే నిరభ్యంతరంగా కేసీఆర్ ’ట్వీట్’ చేయొచ్చు. అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ముందు మోకరిల్లిన కేసీఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తరువాత ట్వీట్ చేయవచ్చని సూచిస్తున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. రజకార్ల వారసుల పార్టీ మజ్లిస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఇంకా కొనసాగుతారా? లేదా? ఆలోచించండి. అట్లాగే కేసీఆర్ తోపాటు రజాకార్ల పార్టీ అయిన మజ్లిస్ వారసులందరినీ పాతబస్తీలోని చార్మినార్ వద్ద రజాకార్ సినిమాను చూపించాలని పేర్కొన్నారు.