మీకు అండగా మేముంటాం.. కాంగ్రెస్ కు మీరు ఓటేయండి

మీకు అండగా మేముంటాం.. కాంగ్రెస్ కు మీరు ఓటేయండి

 పట్నం సునీతా మహేందర్ రెడ్డి కుమార్తె మనీషా రెడ్డి

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: “ మీకు అండగా మేముంటాం... మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.. ఈ ఎన్నికలలో మాకు అండగా మీరు నిలిచి కాంగ్రెస్ కు ఓటేసి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి” అని ఆమె కుమార్తె మనీషా రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోడుప్పల్ లోని ఆకృతి టౌన్ షిప్ లో శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులు బ్రేక్ ఫాస్ట్  మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె స్థానిక నివాసితులను ఉద్దేశించి మాట్లాడారు. ఆకృతి టౌన్ షిప్ లో నివాసితులు తెలియజేసిన సమస్యలను తమ తల్లి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా గతంలో పనిచేసిన ఈ నియోజకవర్గానికి తానే స్వయంగా నా తల్లి సునీతా మహేందర్ రెడ్డి అభ్యర్థిగా నిలిపారని ఆమె తెలిపారు. గతంలో ఈ జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవంతో ఆమెకు ఈ ప్రాంత సమస్యలన్నీ బాగా తెలుసునని, వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తారని ఆమె వెల్లడించారు.

    

అంతకుముందు మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ఆకృతి టౌన్ షిప్ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి విషయంలో ఈ ప్రాంత బీజేపీ నేతలు అర్థంపర్ధంలేని రీతిలో స్థానికత అంశాన్ని తెరమీదికి తెస్తున్నారన్నారు. ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తున్న సునీతా మహేందర్ రెడ్డి గతంలో ఈ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవం కలిగివున్నారని తెలిపారు. అలాగే ఈ ప్రాంత సమస్యలపై ఆమెకు పరిపూర్ణ అవగాహన వుందని, బీజేపీ నాయకులు చేస్తున్న వాదన వాస్తవికత దూరంగా వుందని తెలిపారు. బీజేపీ పెద్దలు ఇప్పుడు రామాలయాన్ని చూపిస్తూ ఓట్లడుతున్నారని, తాతల కాలం నుంచి ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల తర్వాత ఆకృతి టౌన్ షిప్ సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బోడుప్పల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి, కార్పొరేటర్లు హేమలతా రెడ్డి, సుమన్ నాయక్, నాయకులు పులకండ్ల జంగారెడ్డి, చందుపట్ల నరసింహారెడ్డి, బండారు కిశోర్ గౌడ్, రావుల రమేష్, యుగంధర్ రెడ్డి, దక్షిణామూర్తి, సుధాకర్, డాక్టర్ రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.