ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్యకు కారణమదే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్యకు కారణమదే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

ముద్ర,తెలంగాణ:- కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. రూపాదేవి ఆత్మహత్య కు గల కారణాలపై మేడ్చల్ ఏసీపీ రాములు వివరించారు. గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందింది. వెంటనే ఘటన స్థలికి చేరుకున్నామని ఏసీపీ తెలిపారు.

గత కొంతకాలంగా రూపాదేవి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఇప్పటికే వివిధ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. హోమియో మందులు కూడా వాడుతున్నారు. అయినప్పటికీ కడుపునొప్పి తగ్గలేదు. దీంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని ఏసీపీ రాములు వెల్లడించారు. రూపాదేవి ఆత్మహత్య చేసుకోవడాని ముందు భర్త మేడిపల్లి సత్యంకు ఫోన్ కాల్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చొప్పదండిలో ఉన్నారు. తాను కడుపు నొప్పితో పడుతున్న బాధను భర్తకు రూపాదేవి వివరించారు. నేను వస్తున్నాను అని సత్యం ఆయన సతీమణికి చెప్పారు.

రూపాదేవి భర్తతో మాట్లాడిన తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. ఎంతకీ బయటికి రాకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు డోర్ బద్దలు కొట్టి ఆమె బాడీని కిందకు దించారు. వెంటనే సమీపంలోని రెనోవ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని చెప్పారని ఏసీపీ తెలిపారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. అంతా కలిసే ఉంటున్నారని, రూపా దేవి సూసైడ్ చేసుకునే సమయంలో ఆమె తల్లితోపాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని ఏసీపీ తెలిపారు.

భరించలేని కడుపునొప్పి ఆమె ఆత్మహత్యకు కారణం. ఆమె ఫోన్ కూడా వెరీఫై చేశాం.. సీజ్ చేశాం. అలాగే ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మేడ్చల్ ఏసీపీ రాములు పేర్కొన్నారు.