నదిలో కొట్టుకుపోయిన ట్యాంక్.. అయిదుగురు సైనికుల దుర్మరణం
న్యూఢిల్లీ: చైనాతో వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో బ్రాంగ్సా కు చేరువలోని ష్యోక్ నది వరద ఉధృతి కారణంగా ఒక భారతీయ సైనిక ట్యాంక్ కొట్టుకు పోయి ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా అయిదుగురు సైనికులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనను అధికారులు శనివారం వెల్లడించారు. యుద్ధ ఇంజినీర్ల బృందంతో ట్యాంక్ సిబ్బందిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు అధికారులు తెలిపారు. తొమ్మిది మంది సైనికులతో కూడి రెస్క్యూ స్క్వాడ్ ఆ సైనికులను రక్షించేందుకు విఫలయత్నం చేసింది. జూన్ 28న రాత్రి సైనిక శిక్షణ కార్యకలాపాల నుంచి వెనుదిరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా నదిలో నీటి మట్టం పెరిగింది. ఈ స్థితిలో తూర్పు లడఖ్ లోని ససేర్ బ్రాంగ్సా సమీపంలోని ష్యోక్ నదిలో ఆర్మీ ట్యాంక్ చిక్కుకుంది. రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నప్పటికీ వారిని కాపాడే ప్రయత్నం విజయవంతం కాలేదు. ఈ దుర్ఘటనపై భారత సైన్యం విచారం వ్యక్తం చేసింది. ఐదుగురు జవాన్ల కుటుంబాలకు సమాచారం అందించిన తర్వాత వారి పేర్లను సైన్యం వెల్లడిస్తుందని అధికారులు తెలిపారు.
“లడఖ్‌లోని ఒక నదిపై ట్యాంక్‌ను తీసుకెళ్తుండగా దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఐదుగురు మన వీర భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. దేశానికి మన సైనికుల ఆదర్శప్రాయమైన సేవను మనం ఎప్పటికీ మరచిపోలేము. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ దుఃఖ సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుంది' అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో రాశారు.
Deeply saddened at the loss of lives of five of our brave Indian Army soldiers in an unfortunate accident while getting the tank across a river in Ladakh.
— Rajnath Singh (@rajnathsingh) June 29, 2024
We will never forget exemplary service of our gallant soldiers to the nation. My heartfelt condolences to the bereaved…