నేల ఆరోగ్యాన్ని కాపాడాలి

నేల ఆరోగ్యాన్ని కాపాడాలి

ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపనీ ప్రతినిధి సుజాత  

రేగొండ ముద్ర : నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, నేల ఆరోగ్యంగా ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపనీ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తోటకూరి సుజాత అన్నారు. శనివారం గోరికొత్తపల్లి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో నేల ఆరోగ్యం కాపాడుకోవాలని ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ. అధిక రసాయనాలు,పురుగు మందులు వాడటం వలన నేల సారం పూర్తిగా దెబ్బతిందని, కావున రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు,కషాయాలు వాడాలని సూచించారు.

భూసార పరీక్షలు చేసుకొని ఫలితాల ఆధారంగా మోతాదును బట్టి సిఫారసు చేసిన ఎరువులను వాడాలన్నారు. మోనో క్రోటోఫాస్ మందు వాడకాన్ని తగ్గించాలని, దీని వాడకం వలన గాలి,నీరు అన్ని కలుషితమవుతున్నాయని సూచించారు. పచ్చిరొట్ట ఎరువులను వేసి నేలలో కలియదున్నడం వలన నేల సారం పెరగడమే కాకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిగురుమామిడి రాజు, ప్రజ్వల్  డైరెక్టర్ రాజు, ప్రజ్వల్ సంస్థ ప్రతినిధులు సాదు తిరుపతి, సబ్బిడి గీత, నారాయణ దాసు దీప మరియు 50 మంది రైతులు పాల్గొన్నారు.