ఆదర్శ పంతుళ్లు..! ప్రభుత్వ బడిలోనే తమ పిల్లల చదువులు..

ఆదర్శ పంతుళ్లు..! ప్రభుత్వ బడిలోనే తమ పిల్లల చదువులు..

కేసముద్రం- ముద్ర: తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కార్పొరేట్ బడుల్లో చేర్పించి చదువు చెప్పిస్తున్న అనేకమంది ప్రభుత్వ పంతుళ్లకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో  ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తాము చదువు చెప్పే బడిలోనే తమ పిల్లలను చదివిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. కోమటిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్కే సయ్యద్ తన కుమార్తె తయ్యబాను కూడా వెంట తీసుకెళ్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదువిస్తున్నాడు. అలాగే ఇనుగుర్తి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేశ్వర చారి తన ఇద్దరు పిల్లలు చైతన్య ఋషి నీ హైస్కూల్లో ఏడవ తరగతి, కుమార్తె ఆరాధ్యను తాను చదువు చెప్పే ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదివిస్తున్నారు.

ఇదేవిధంగా కేసముద్రం స్టేషన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగయ్య సైతం తన కుమార్తె ప్రణవిని అదే పాఠశాలలో నాలుగేళ్లుగా చదివిస్తున్నాడు. చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో ఏటా ఫీజులు చెల్లిస్తూ, కార్పొరేట్ స్థాయి ప్రైవేటు స్కూళ్ళలో చేర్పించడంతోపాటు, తమ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే చోట నివాసం ఉండకుండా పట్టణాల్లో ఉంటూ తాము ఉద్యోగం చేసే పాఠశాలకు షటిల్ సర్వీసులు చేస్తున్న ఈ కాలంలో, తమ పిల్లలను కూడా కార్పొరేట్ స్థాయి ప్రైవేటు పాఠశాలలో చేర్పించి విద్య చెప్పించే ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ, మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 300 మందికిపైగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, ఇలా ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే తమ పిల్లలను ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వెంట తీసుకెళ్లి సాటి పేద విద్యార్థులతో కూర్చోబెట్టి తర తమ భేదాల్లేకుండా విద్యా బోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.