ఖాకీల కరుణ.! - అర్ధరాత్రి గర్భవతిని   ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఖాకీల కరుణ.! - అర్ధరాత్రి గర్భవతిని   ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ముద్ర ప్రతినిధి, వరంగల్: విధుల్లో భాగంగా పోలీసులు.. 'ఖాకీ కఠిన్యం, పోలీసుల జులుం నశించాలి' వంటి విమర్శలు ఎదుర్కొంటుంటారు. కానీ, వారికి కూడా మానవత్వం ఉంటుందని నిరూపించారు. హనుమకొండ జిల్లా కేయూసీ పరిధిలోని పోలీసులు చేసిన పని ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కేయూసీ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు షబ్బీర్, యుగేందర్, వాసు  సోమవారం రాత్రి 2:30 నిమిషాలకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ లో భాగంగా బృందావన్ కాలనీకి చేరుకున్నారు. అదే సమయంలో ఓ గర్భవతి పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళేందుకు భర్తతో కలిసి రోడ్డుపై వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. గర్భవతిని గమనించిన పోలీస్ సిబ్బంది.. వెంటనే పెట్రోలింగ్ కార్ లోకి భర్తతో సహా గర్భవతిని ఎక్కించుకుని హనుమకొండ లోని ప్రైవేట్ ఆస్పత్రికి వారిని తరలించారు. అత్యవసర సమయంలో స్పందించి ఆస్పత్రికి తరలించిన పోలీసులను వరంగల్  సీపీ  రంగనాథ్, స్థానికులు అభినందించారు.