రేవంత్ కేమీ 'తుంటి' విరగలేదు కదా పరామర్శించడానికి?: కొడాలి నాని

రేవంత్ కేమీ 'తుంటి' విరగలేదు కదా పరామర్శించడానికి?: కొడాలి నాని
  • ఇటీవల కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్
  • ఏపీ సీఎం జగన్ తనకు మర్యాదపూర్వకంగా ఫోన్ కూడా చేయలేదన్న రేవంత్!
  • ట్విట్టర్ లో విషెస్ తెలిపారు కదా అంటూ కొడాలి నాని వివరణ
  • రేవంత్ ఏమైనా సుప్రీం అనుకుంటున్నాడా అంటూ వ్యాఖ్యలు

ఇటీవల ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ వెళ్లి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనకు మర్యాదపూర్వకంగా కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, దీనికి మీరేమంటారని ఓ మీడియా రిపోర్టర్ కొడాలి నానిని ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ... రేవంత్ రెడ్డిని అభినందిస్తూ బెస్ట్ విషెస్ అంటూ సీఎం జగన్ ట్విట్టర్ లో పెట్టాడు కదమ్మా అన్నారు.  

మా ఓటమికి జగన్ ఎంత చేయాలో అంతా చేశారు... అవన్నీ కూడా నాకు తెలుసు అని రేవంత్ అన్నారు అంటూ మరో మీడియా ప్రతినిధి కొడాలి నానిని వివరణ కోరారు. అందుకు కొడాలి నాని స్పందించారు. "మేం ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లమా... రేవంత్ రెడ్డిని గెలిపించడానికి. తెలంగాణలో మేం ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. అక్కడ మా పార్టీని తీసేసి కేవలం ఏపీ వరకే పరిమితం అయ్యాం. గతంలో మేం ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ స్థానం గెలిచాం, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం... మేం పోటీ చేసిన ప్రతి చోటా 40 వేలు, 50 వేలకు తగ్గకుండా ఓట్లు వచ్చాయి. కానీ తెలంగాణలో పార్టీ వద్దనుకునే కదా తీసేశాం. అలాంటప్పుడు తెలంగాణలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్నది మాకు సంబంధం లేని విషయం. 

ఎవరో గెలిచారని జగన్ మోహన్ రెడ్డి గారు ఎగబడిపోవడం ఉండదు, దూరంగా వెళ్లిపోవడం ఉండదు... ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటారు. అభినందనలు అంటూ ట్విట్టర్ లో పెట్టారు... అంతవరకే. ఫోన్ చేసి అభినందించలేదు అంటే ఎలా? 
కేసీఆర్ గారికి తుంటి విరిగింది కాబట్టి జగన్ వెళ్లి పరామర్శించారు... రేవంత్ కేమీ తుంటి విరగలేదు కదా పరామర్శించడానికి. ఈయనకు ఫోన్ చేసేది ఏంటంట! మర్యాదపూర్వకంగా ట్వీట్ చేశాక కూడా ఇంకేంటి! నాకు ఫోన్ చేయలేదు... నన్నొచ్చి కలవలేదు అంటే ఎలా!  అందరూ చంద్రబాబులాగా ఉంటారా? చంద్రబాబు ఎవరు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారా అని కాచుకుని ఉంటాడు... వాళ్లకు ఫోన్ చేసి నేనే నిన్ను గెలిపించానని చెబుతాడు... ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు.  
రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోంది ఏమైనా ప్రాంతీయ పార్టీకా...? ఆయనేమైనా సుప్రీం అనుకుంటున్నాడా? రేవంత్ రెడ్డి గురించో, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించో పట్టించుకునేంత టైమ్ జగన్ మోహన్ రెడ్డి గారికి లేదు" అంటూ కొడాలి నాని స్పష్టం చేశారు.