మంగళసూత్రం అమ్మిన బండికి వేల కోట్లు ఎక్కడివి...?

మంగళసూత్రం అమ్మిన బండికి వేల కోట్లు ఎక్కడివి...?
  • మ్యాచ్ ఫిక్సింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ కరీంనగర్ ఎంపీ
  • ఫోన్ ట్యాపింగ్ లో బయటపడ్డ బండి అవినీతి  భాగోతం
  • అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారు
  •  గ్రానైట్,  స్మార్ట్ సిటీ, కేబుల్ బ్రిడ్జ్, ల్యాండ్ మాఫియాలో దోచుకున్నది నిజం కాదా
  •  అవినీతికి పాల్పడ్డ వారికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ సిద్ధం 
  •  కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  వెలిచాల రాజేందర్ రావు

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : శాసనసభ ఎన్నికల్లో మంగళసూత్రం అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్ కి వేల కోట్లు ఎలా వచ్చాయని కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కి  బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ , తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారే వ్యక్తి బండి అంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. మాజీ డిజిపి  ప్రభాకర్ రావుతో తనకు సంబంధాలు ఉన్నాయని  బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తనకు ఏదో  కరీంనగర్ లో ఇల్లు లేక  అశోక్ రావ్ ఇంట్లో ఉంటున్నట్టు బండి సంజయ్ మాట్లాడడం సరైన పద్ధతి కాదని, నోరు అదుపులో ఉంచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని, ప్రభాకర్ రావు ఎవరో కూడా తనకు తెలియదని, తన స్నేహితుడి వియ్యంకుడైనంత మాత్రాన ప్రభాకర్ రావుతో  సంబంధాలు ఉన్నాయని అంటగట్టడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఫోన్ ట్యాంపింగ్ పై స్పందించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, విచారణను ముమ్మరం చేయాలని పలుమార్లు తమ నేత రేవంత్ రెడ్డి  డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుకుతెచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రాలను కోసం తన భార్య మెడలోని పుస్తెలు అమ్ముకున్నానని చెప్పిన బండి సంజయ్ పదేళ్లలో వేల కోట్లు ఎలా సంపాదించారని రాజేందర్ రావు నిలదీశారు.

కరీంనగర్ లో  మ్యాచ్ ఫిక్సింగ్ కు తెరలేపిన ఘనుడు బండి సంజయ్ అని, గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కేబుల్ బ్రిడ్జ్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ తదితర పనుల్లో ఎంత దోచుకున్నావో ప్రజలకు తెలుసని ఆయన విమర్శించారు. మొన్నటివరకు బీఆర్ఎస్ కు వంత పాడిన బండి సంజయ్ ఇప్పుడు ఫోన్ టాపింగ్ లో ఇరుకోవడం వల్ల  మతిభ్రమించి మాట్లాడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవినీతికి పాల్పడ్డ బండి సంజయ్ బండారం బయటపడటంతోనే  బిజెపి అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని పేర్కొన్నారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు  స్థానికులు, కొందరు పాత్రికేయులు కూడా సంజయ్ దగ్గర వేలకోట్లు ఉన్నాయి నువ్వు ఆయన మీద తట్టుకోగలవా? అని తనను అడిగారని, కానీ తాను ఇంత లోతుగా ఆలోచించలేదన్నారు.

మాజీ పోలీసు అధికారి ప్రభాకర్ రావు మీద ఆరోపణలు వస్తే, తన చిన్ననాటి స్నేహితుడైన  అశోక్ రావుని తాను ఎందుకు వదులుకోవాలని రాజేందర్ రావు  ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని  చట్టం వదలదని  పునరుద్ఘాటించారు. తన కుటుంబ జీవితం గురించి కరీంనగర్ మొత్తం తెలుసునని, చిన్న మచ్చ మరకలేని కుటుంబం కావడంతో తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును ఇచ్చిందని స్పష్టం చేశారు. దాంతోపాటు రెడ్డి సామాజిక వర్గానికి అప్పటికే 7 సీట్లు కేటాయించడం, కరీంనగర్ తమ సామాజిక వర్గానికి కేటాయింపు అనివార్యం కావడంతో  తనకు సీటు దక్కిందని స్పష్టం చేశారు. ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తే తనకు సీటు వచ్చినట్టు బండి సంజయ్ మాట్లాడటం హేయమైన ఆరోపణగా చెబుతూ, నోరు అదుపులో ఉంచుకోకపోతే  తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని  వెలిచాల హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిప్పులాంటిదని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అలాంటి తమపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇక తన జీవిత ప్రయాణం మొత్తం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, తన తండ్రి జగపతిరావు కరీంనగర్ కోసం చేసిన కృషి అందరికీ తెలుసన్నారు. తాను యువజన విభాగం నుండే కాంగ్రస్ కార్యకర్తనని, సింగిల్ విండో చైర్మన్ గా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేసిన తనపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊర్కోరని హెచ్చరించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఫోన్ టాపింగ్  తెర తీసిందే బిజెపి అని, కెసిఆర్ బిజెపితో అనుకూలంగా ఉండేందుకే ఫోన్ టాపింగ్ ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు. అయితే ఈ తరుణంలో  నీ ఫోన్ టాపింగ్ జరిగి, నీ బండారం మొత్తం బయటపడిందని, అవినీతి ఆరోపణలు చిట్టా తెలిసి  బిజెపి నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ ఒక సైకో అని తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారు.. ఏం చేస్తున్నారు.. ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనే ఆత్రంతో తోచింది చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ బిజెపిలు ఒక్కటే అని బిజెపి గెలిచే ప్రాంతంలో బీఆర్ఎస్, బీఆర్ఎస్ గెలిచే ప్రాంతంలో బిజెపి  డమ్మీలను పోటీలో దించిందని విమర్శించారు. బండి సంజయ్ ఓటమి భయంతోనే ఫోన్ టాపింగ్ విషయాన్ని తెరమీదకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తప్పులు చేసిన వారి కోసం చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూంలో ఏర్పాటు చేస్తున్నామని, అందుకు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు.