అధికారుల తప్పిదం... అందని రైతు బీమా

అధికారుల తప్పిదం... అందని రైతు బీమా
  • ఆగం అయిపోయిన రైతుకుటుంబం 
  • కోర్టు కెక్కిన రైతు తల్లి 

ముద్ర.వనపర్తి:-వ్యవసాయ అధికారుల తప్పిదంతో మరణించిన రైతుకు రైతు బీమా అందని సంఘటన పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో చోటుచేసుకుంది.ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో డాటా ఎంట్రీ లో తప్పులు జరగడంతో ఆ రైతు కుటుంబం ఐదు లక్షల బీమా ను  కోల్పోయింది.

వివరాల్లోకి వెళ్ళగా గుమ్మడం గ్రామానికి చెందిన పుల్లూరు నరోత్తం రెడ్డి (40)  అనే రైతు అనారోగ్య కారణాలతో వైద్య చికిత్స పొందుతూ 29/10/2020 రోజున చనిపోయారు. చనిపోయిన రైతు పుల్లూరు నరోత్తం రెడ్డి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. రైతు యొక్క నామిని పుల్లూరు వసంతమ్మ (76) అనారోగ్యంతో మంచం పట్టి ఉంది. ఆమె మందులు ,ఆలనా, పాలన చూసి వారే కరువయ్యారు.కనీసం రైతుబిమాతోనైనా తన శేష జీవితాన్ని గడుపుదాం అనుకుంటే వ్యవసాయ అధికారుల తప్పిదం వల్ల నేటికి చనిపోయిన రైతు నామినీ పుల్లూరు వసంతమ్మకు బీమా రాకపోవడంతో అనేక ఆర్థిక కష్టనష్టాలకు ఆ కుటుంబం గురైంది.

గతంలో  పనిచేసిన ఏ ఈ ఓ డాటా ఎంట్రీ లో  రైతు పుట్టిన తేదీని 01/07/1960 వేయడంతో ఇన్సూరెన్స్  వయస్సు పరిధి దాటి పోవడంతో రెగ్యులర్గా ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ కాలేదు. . కానీ  అతని అసలు ఎస్ఎస్సి సర్టిఫికెట్ ప్రకారం 15/06/1980 వయసు 40 సంవత్సరాలు కూడా దాటలేదు. విషయంపై పలుమార్లు వ్యవసాయ అధికారులను సంప్రదించినప్పటికీ, సరైన విధంగా స్పందించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు న్యాయపోరాటం ప్రారంభించారు.

 తమకు జరిగిన అన్యాయంపై  వినియోగదారుల ఫోరంలో  కేసు వేయగా ఆర్గ్యుమెంట్స్ జరిగి కేసు తీర్పు దశలో ఉందని   మృతుని సోదరి తెలిపారు.తక్కువ సమయంలో డాటా ఎంట్రీ చేయoడని ఉన్నతాధికారుల ఆదేశించడంతో సరియైనటువంటి పరిశీలన లేకుండానే ఇన్సూరెన్స్ పాలసీలు ఇష్యూ అవుతున్నాయి. కనీసం పాలసీదారులకైనా బాండ్లు పంపిణీ చేస్తే అందులో తప్పులను వారు గుర్తించి సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితినీ రైతన్నలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 నుండి 70 కేసులు ఉన్నాయని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రైతు బీమా ఆ రైతు కుటుంబానికి అందకపోవడం చాలా బాధాకరమని, అన్నదాతలు అంటున్నారు.

ఈ విషయంలో తప్పు ఎవరిది, బాధ్యత ఎవరు వహిస్తారు అని ,ఇటు వ్యవసాయ అధికారులు, అటు అన్నదాతలు కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారు.క్షేత్రస్థాయిలో ప్రతి రైతు బీమా ఉన్నటువంటి రైతుకు ప్రతి సంవత్సరము బీమా ప్రతిని అందిస్తే తప్పులు తిరగకుండా రైతు స్థాయిలోనే పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాట్లు చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.