బీఆర్ఎస్ కు బిగ్ షాక్!

బీఆర్ఎస్ కు బిగ్ షాక్!
  • ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిక

ముద్ర వార్తలు, హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గులాబీదళానికి చెందిన ఆరుగురు శాసనమండలి సభ్యులు ఒకేసారి కాంగ్రెస్ చేరారు. ఎక్కడా ముందస్తు ఊహాగానాలకు తావులేకుండా, ఏవిధమైన చడీచప్పుడు లేకుండా ఈ ప్రక్రియ ఎంతో రహస్యంగా జరిగిపోయింది. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీల సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, దండె విఠల్, బస్వరాజు సారయ్య, యెగ్గే మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారాపు దయానంద్ లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన కొద్ది సమయంలోనే ఈ చేరికలు జరిగిపోయాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో దానం నాగేందర్‌ , కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్ కుమార్‌, కాలె యాదయ్య ఉన్నారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్‌ కూడా ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.