నేటి తరం మహిళలు జీవనశైలి

నేటి తరం మహిళలు జీవనశైలి

నేటి రోజుల్లో చాలా మంది మహిళలు థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అధిక బరువు పెరుగిపోయి, అది తగ్గించుకోవడానికి తిప్పలు పడుతున్నారు. మరి ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే శరీరానికి వ్యాయామం చాలా అవసరం. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా మహిళలు, ముఖ్యంగా 8–9 గంటలపాటు ఉద్యోగం చేసేవారు తమ జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చాయి. వాటిలో ప్రధానమైనది శారీరక శ్రమను తగ్గించడం. ఇంట్లోంచి పని చేసే కొత్త సంస్కృతి చాలా మంది ఉద్యోగులకు సౌకర్యంగా కనిపించినప్పటికీ, ఇది వారి ఆరోగ్యంపై కనిపించని ప్రభావాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో.. ఎందుకంటే మహిళలు సులభంగా బరువు పెరుగుతారు.  40 ఏళ్ల తర్వాత మహిళల్లో శారీరక శ్రమ తగ్గితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు, రుతుక్రమ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. శరీరం చురుగ్గా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం అంటే జిమ్​లకే వెళ్లక్కరలేదు. తేలిగ్గా అందరికీ అందుబాటులో ఉంటూ, శరీరంలోని కొవ్వుని అవలీలగా కరిగించే వ్యాయామాలను ఒకసారి చూద్దాం. 
నడక..
నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం పదివేల అడుగులు వేయాలట. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం.. నడక రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  అంతేకాదు శరీరంలో కొవ్వు కరగడానికి, బరువు తగ్గడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, నిద్రను మెరుగుపరచడానికి,  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి, మానసిక క్షీణతను తగ్గించడానికి సహాయపడుతుంది.  రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలపై జరిపిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల నడక.. తుంటి పగుళ్ల ప్రమాదాన్ని 40 శాతం తగ్గించిందని పరిశోధకులు చెబుతున్నారు.  హార్వర్డ్ హెల్త్ సైన్స్​ప్రకారం, 155-పౌండ్లు(70-కిలోలు) ఉన్న వ్యక్తి గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో, 30 నిమిషాల పాటు నడిస్తే 167 కేలరీలు బర్న్ చేస్తారని అంచనా వేశారు. కాబట్టి మహిళలకు నడక చాలా మంచిది.
జాగింగ్..
30 నిమిషాల పాటు నడవడం సౌకర్యంగా ఉంటే,  నడకను సాధారణ జాగింగ్‌కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. నడక కంటే జాగింగ్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది హానికరమైన విసెరల్ కొవ్వు , పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వాకింగ్ లాగానే జాగ్ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. 
సైక్లింగ్..
 సైక్లింగ్ కూడా చాలా మంచి వ్యాయామం.  సైకిల్​ తొక్కే అలవాటు  ఉంటే.. 30 దాటిన తర్వాత మళ్లీ ప్రారంభించడం ఉత్తమం. హార్వర్డ్ హెల్త్ ఉదహరించిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ, బరువులో మార్పుల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయడానికి పరిశోధకులు 16 సంవత్సరాల పాటు 18,000 కంటే ఎక్కువ మంది మహిళలను పరిశీలించారు. వారి పరిశోధన ప్రకారం నడక, జాగింగ్ కంటే కూడా  సైక్లింగ్ వల్ల ఎక్కువ ఫలితాలు కనిపించాయి. 
ఈత
ఈత కొట్టడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇది గొప్ప వ్యాయామమే కాకుండా ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని కూడా ఇస్తుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల మీ  గుండె పనితీరు పెరుగుతుంది. కొవ్వును కరిగిస్తుంది. ఇది కండరాలను టోన్ చేస్తుంది. మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది.
యోగా..
ప్రతిరోజూ యోగా చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చు.  అంతేకాదు.. ఇది ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. యోగా శరీరంలో మార్పును కలిగిస్తుంది. యోగా వల్ల రుతు సంబంధమైన వ్యాధులే కాదు, దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులే కాకుండా వయసురీత్యా వచ్చే అల్జీమర్స్ వ్యాధి కూడా తగ్గుతుంది.