నేహా ది గ్రేట్ 

నేహా ది గ్రేట్ 
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా ఎంపిక 
  • నేరేడుచర్లకు వన్నెతెచ్చిన నేహా 

నేరేడుచర్ల ముద్ర:-  ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన వనపర్తి నేహా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉద్యోగం సాధించి నేరేడుచర్ల పట్టణానికి వన్నె తెచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యోగ నియామకాలలో 3.80 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 480 మంది ఉత్తీర్ణత సాధించారు.

నేహా ది గ్రేట్ అనేలా అందులో ఒకరుగా నిలిచారు. నేరేడుచర్ల పట్టణానికి చెందిన వనపర్తి శ్రీనివాస్ సుజాత దంపతుల పుత్రిక నేహా. పాఠశాల విద్యాభ్యాసం స్థానిక ప్రగతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అభ్యసించగా 10వ తరగతి 2015-16 లో చిల్లేపల్లి సిటీ సెంట్రల్ పాఠశాలలో చదివి 9.8 జిపిఏ సాధించింది. మాదాపూర్ నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యనభ్యసించి 467/470 మార్కులతో మొదటి సంవత్సరం స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ద్వితీయ సంవత్సరం 990/1000 మార్కులతో స్టేట్ 3 ర్యాంకు సాధించారు.2017లో వరంగల్ ఎన్ఐటి లో సీటు సాధించి 2018-22లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

విద్యాభ్యాసం అనంతరం బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తూ ఏ టి సి పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. వీరి స్వగ్రామం గరిడేపల్లి మండలం పొనుగోడు కాగా నేరేడుచర్లలో స్థిరపడ్డారు. తల్లి సుజాత గృహిణిగా, తండ్రి శ్రీనివాస్ ఫర్టిలైజర్ కంపెనీలో మేనేజర్ గా, నేహా సహోదరుడు వంశీ కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రులు , సోదరుడు వంశీ ల అందించిన ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు  నేహా పేర్కొన్నారు. స్నేహ సాధించిన  విజయం పట్ల ప్రగతి పాఠశాల, నారాయణ కళాశాల, యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు, బంధుమిత్రులు అభినందించారు.