భారీ గాలులతో యూఎస్ లో విధ్వంసం

భారీ గాలులతో యూఎస్ లో విధ్వంసం
  • నాలుగు రాష్ట్రాలలో 22 మంది దుర్మరణం
  • చీకట్లో అయిదు లక్షల మంది

 A series of powerful storms in United States: అమెరికా దేశంలోని పలు రాష్ట్రాలను టోర్నడో అల్లకల్లోలం చేసింది. యూఎస్ లోని టెక్సాస్, ఓక్లహామా, కెంటకీ, అర్కన్సాస్ లను భారీ తుపాను టోర్నడో రూపంలో చుట్టుముట్టింది. ఈ నాలుగు రాష్ట్రాలలో తుపాను, భారీ గాలుల కారణంగా మొత్తం 22 మంది చనిపోయారని సమాచారం. అలాగే వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్కన్సాస్ లో ఎనిమిది మంది, కెంటకీలో నలుగురు, టెక్సాస్ లో ఏడుగురు, ఓక్లహామాలో ఇద్దరు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. తుపాను, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్టు అధికారులు చెబుతున్నారు.

చీకట్లో అయిదు లక్షల మంది

విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి టెక్సాస్, కాన్సాస్, మిస్సౌరీ, అర్కాన్సాస్, టెన్నెస్సీ, కెంటకీలలో దాదాపు అయిదు లక్షల మందికి పైగా ప్రజలు విద్యుత్తు సౌకర్యానికి దూరమయ్యారు. టోర్నడో ధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. అలాగే, జార్జియా, సౌత్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలు సోమవారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన తుఫాన్ హెచ్చరికలో ఉన్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. ఒహియో, టేనస్సీ లోయలలో సుడిగాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టోర్నడోల కారణంగా బలమైన గాలులు, భారీ వడగళ్ళు, కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తుఫాను అంచనా కేంద్రం వెల్లడించింది.