98 మంది భారతీయ హజ్ యాత్రికులు మృత్యువాత

98 మంది భారతీయ హజ్ యాత్రికులు మృత్యువాత
  • విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడి

న్యూఢిల్లీ: హజ్ యాత్రకు మక్కా వెళ్లిన వారిలో కనీసం 98 మంది భారతీయ యాత్రికులు మృత్యువాత పడ్డారని భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, సాధారణ అనారోగ్యం, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు మరణించిన వారిలో వున్నారని తెలిపారు. అక్కడి వేడి వాతావరణం కారణంగా వీరి మరణాలు సంభవించినట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. దాదాపు 1,75,000 మంది భారతీయులు ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లారని తెలిపింది. మృతుల్లో అక్కడ ప్రమాదానికి గురై చనిపోయిన నలుగురు వ్యక్తులు కూడా ఇందులో వున్నారని పేర్కొంది. ఈ ఏడాది మొత్తం 1,75,000 భారతీయ యాత్రికులు హజ్ ను సందర్శించగా, వారిలో 98 మంది మన పౌరులు కన్నుమూశారని తెలిపారు. గతద ఏడాది 187 మంది హజ్ యాత్రికులు చనిపోయినట్టుగా తెలిపింది. ఏఎఫ్ పీ వార్తాసంస్థ అందిస్తున్న వివరాల మేరకు సుమారు 10 దేశాలకు చెందిన 1,081 మంది హజ్ యాత్రికులు ఈ ఏడాది చనిపోయారు. మొత్తం చనిపోయిన వారిలో 658 మంది ఈజిప్షియన్లు, 183 మంది ఇండోనేషియన్లు, 68 మంది జోర్డానియన్లు, 58 మంది పాకిస్థానీయులు ఉన్నారని ఆ వార్తా సంస్థ తెలిపింది. వీరితో పాటు మలేసియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, సూడాన్, ఇరాక్ లోని స్వయంప్రతిపత్తి కుర్దిస్థాన్ ప్రాంతీయులు కూడా చనిపోయిన వారిలో వున్నారని వెల్లడించింది.