సైనిక్ స్కూల్ తరలించొద్దు ... ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరైన సైనిక్ స్కూల్ ను సికింద్రాబాద్ కు తరలించొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం డివిజన్ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ ను విద్యా హబ్ గా మార్చేందుకు కృషి చేసింది అన్నారు. 2017న ఎల్కుర్తి గ్రామంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు.
వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూల్ ను సికింద్రాబాద్ కు తరలించే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కడియం ద్వజమెత్తారు.ఈ దుశ్చర్యను ఖండిస్తున్నామని అన్నారు.ఎల్కుర్తి గ్రామంలో అగ్రిమెంట్ అయిన స్థానంలోనే సైనిక స్కూల్ ఏర్పాటుచేయాలని శ్రీహరి డిమాండ్ చేశారు.జిల్లాపై మంత్రులకు ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిని ఒప్పించి సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సహకరించాలి కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై చేపడుతున్న పనులకు అంతరాయం కలుగకుండా కొనసాగించేలా ముఖ్యమంత్రి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా 450 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అమలు చేసి తీరాలన్నారు. ఈ నెల 31 తో ముగిస్తున్న సర్పంచుల కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని సూచించారు.
ప్రత్యేక అధికారులను నియమించి అధికారాన్ని ప్రభుత్వ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఆరోపించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ సీనియర్ నేతలు బెలిదె వెంకన్న, భూర్ల లతాశంకర్, రాపోలు మధుసూదన్ రెడ్డి, తోట సత్యం, గట్టు రమేష్ గౌడ్, కనకం రమేష్, గుర్రం ఫాతికుమార్, దుంపల పద్మారెడ్డి, మెట్టిల్లి రమేష్, గన్ను నరసింహులు, పోకల నారాయణ, బెల్లపు వెంకటస్వామి, తోట సత్యం, ఫాతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.