ఆదివారం ఆసుపత్రికి సెలవా ?

ఆదివారం ఆసుపత్రికి సెలవా ?
  • ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెబుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సెలవా ? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని 30 పడకల ఉన్నతశ్రేణి ఆరోగ్య కేంద్రాన్ని నాయకులు కొలిపాక సతీష్, మేకల మల్లేశం, కోల శ్రీనివాస్, పొన్న శేఖర్, జంపాల శీను, కలకోల రఘు, యాదగిరిలు ఆదివారం సందర్శించారు. వైద్య సిబ్బంది లేక వెలవెల బోతున్న ఆసుపత్రిని సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ ఇద్దరు డాక్టర్లు, ఇద్దరూ స్టాఫ్ నర్సులు, ఒక వార్డ్ బాయ్, ఒక స్వీపర్, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాల్సిన ఈ ఆసుపత్రిలో ఒక స్టాఫ్ నర్స్, ఒక వార్డ్ బాయ్, సెక్యూరిటీ మినహా ఇతర సిబ్బంది లేరని వారు ఆరోపించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులు వచ్చినప్పటికీ వారిని పరీక్షించి మందులు రాసే డాక్టర్ జాడ లేని దుస్థితి ఆసుపత్రిలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని స్థానిక ఎమ్మెల్యే పదేపదే చెప్పినప్పటికీ వైద్య సిబ్బంది తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారులు స్పందించి ఆదివారం విధులకు గైరాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.