కాలమై కరువు పడ్డట్లుగా ఉంది రైతు గోస

కాలమై కరువు పడ్డట్లుగా ఉంది రైతు గోస
  • వేల ఎకరాల్లో ఇసుక మెటలు
  • వరదకి తెగి గండ్లు పడిన పొలాలు
  • తగ్గుముఖం పట్టిన వర్షాలు

ముద్ర న్యూస్ రేగొండ:-కాలమై కరువు పడ్డట్టుగా రైతుల గోస ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం నుండి రైతులు ఎదురు చూశారు. నెలరోజుల పాటు కాలం ఆలస్యమైనా ఇప్పుడు పడుతున్న వర్షాలతో పంటలు పడతాయి అని ఆశ పడ్డ ఫలితం లేకపోయింది. గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడి పొలాల్లోకి వరద నీరు చేరడంతో ఇసుక మెట్లు పెట్టాయి.రేగొండ మండలం చిన్న కోడెపక,దమ్మన్న పెట,కొనరావు పేట,వెంకటేశ్వర్ల పల్లి. కాకర్ల పల్లి,పోచం పల్లి గ్రామాల్లో చెరువులు పూర్తిగా తెగిపోవడంతో చెరువు లోని నీరు మొత్తం పొలాల్లోకి చేరింది దీనితో ఇసుక, బురద, మట్టి, చేరి రైతులు సదును చేసుకొనే పరిస్తితి లేకుండా పోయింది. మండలంలోని చిన్నకోడెపక,చెరువు పారకం రెండు వేల ఎకరాలు ఉంటుంది దమ్మన్న పేట చెరువు పారకం దాదాపు 15 వందల నుండి 2 వేల వరకు ఉంటుంది.ఈ చెరువుల కింద వరి తప్ప ఇతర పంటలకు అనువుగా ఉండదు.చెరువులకు ఎగువన పత్తి. మిర్చి. మొక్కజొన్న. పంటల విత్తనాలు నాటిన వరద తాకిడికి విత్తనాలు మొత్తం కొట్టుకు పోయాయి.ఇప్పటి వరకు ఒక్కో రైతు రెండు మూడు సార్లు విత్తనాలు నాటి నష్టపోయారు కనీసం తేలిక పాటి పంటలు పండించుకొని బ్రతికే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం అయి కూడా కరువులో ముంచిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వెంటనే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.