ఓట్లు మావే...మంచిర్యాల సీటు మాదే

ఓట్లు మావే...మంచిర్యాల సీటు మాదే
  • బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
  • ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వకపోతే స్వతంత్రంగా బరిలోకి
  • బీసీలకు మద్దతు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో  బీసీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలుపించుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు తీర్మానించారు. శుక్రవారం మంచిర్యాల లోని ఓ ఫంక్షన్ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు హాజరయ్యారు.   బీసీ జనాభా ఉన్న నియోజకవర్గ ములో  తక్కువ ఓట్లు ఉన్న ఓ సామాజికవర్గం ఆధిపత్యం చాలాయిస్తోందని వక్తలు పేర్కొన్నారు. 1978లో బీసీ నాయకుడు చుంచు లక్ష్మయ్య మినహా ప్రతి ఎన్నికల్లో వెలమ, రెండు ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం నేతలు శాసనసభ కు ఎన్నికయ్యారని తెలిపారు. బీసీల్లో ఐక్యత లేని కారణంగా ఎన్నికల్లో గెలుపును అందుకోలేకపోతున్నారని ఆత్మపరిశీలన చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లోనైన బీసీలు సమిష్టిగా ఉండాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఐక్యత ప్రదర్శిస్తేనే ప్రధాన పార్టీలు బీసీలను గుర్తించి టికెట్ లు ఇవ్వడానికి ముందుకు వస్తాయని అన్నారు. ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారు. బీసీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, ముస్లీమ్ నేతలు స్పష్టం చేశారు. ఈసమావేశంలో ముత్తినేని రవికుమార్, డాక్టర్ రవి కిరణ్ ఇతర నేతలు పాల్గొన్నారు.
 
బీసీ గర్జనకు సన్నద్ధం

మంచిర్యాల లో బీసీ గర్జన ఏర్పాటు చేసి బీసీల ఐక్యమత్యంను చాటి చెప్పాలని సంకల్పించినట్లు బీసీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావాహులు మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్, ప్రముఖ డాక్టర్ పూజారి రమణ, మాజీ మావోయిస్టు అర్జున్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, డాక్టర్ రఘునందన్ , నీలి శ్రీనివాస్ తెలిపారు. గర్జన ద్వారా బీసీల సత్తా తెలియజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో బీసీలు రాజ్యాధికారం కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. సమిష్టి అభిప్రాయం మేరకు గర్జన తేదీ ప్రకటిస్తామని చెప్పారు.

బీసీలకు గోనె ప్రకాష్ రావు మద్దతు

మంచిర్యాల నియోజకవర్గంలో బీసీలు చేస్తున్న రాజకీయ అస్థిత్వపోరాటానికి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మద్దతు ప్రకటించారు. బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రకాష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ అభ్యర్థి పోటీ చేస్తే నగదు ఆర్ధిక విరాళం అందజేస్తామని తెలిపారు. జనాభాలో కీలకమైన బీసీలు పల్లకి మోసేబోయులుగా చరిత్రలో నిలువరాదని సూచించారు.