పొన్నం శ్రమకు ఫలితం దక్కేనా

పొన్నం శ్రమకు ఫలితం దక్కేనా
  • తీవ్రంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, మేడిపల్లి, ఆది
  • కాంగ్రెస్ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్న మంత్రి
  • గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక ప్రణాళికలు
  • ఓ వైపు చేరికలపై దృష్టి మరోవైపు ప్రచార వ్యూహాలు
  • కాంగ్రెస్ కు క్యాండిడేట్ మైనస్?
  • ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్న వెలిచాల  ప్రసంగాలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని తానై ప్రచారం నిర్వహిస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి మంత్రిగా బూతు స్థాయి కార్యకర్తల నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు కార్యాచరణ రూపొందిస్తూ వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు. తన దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి కాంగ్రెస్ విజయం కోసం విశ్రమించకుండా శ్రమను ధారపోస్తున్నాడు. కరీంనగర్ సీటు గెలుచుకొని  కాంగ్రెస్ అధిష్టానం వద్ద తన ప్రాముఖ్యతను నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం తోపాటు ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నారు. ఒకవైపు చేరికలపై దృష్టి సారిస్తూనే మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. రాజేందర్ రావు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. తన పదునైన వాగ్బానాలతో ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేస్తున్నారు.

కాంగ్రెస్ కు క్యాండిడేట్ మైనస్?

కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ కు క్యాండిడేట్ వెలిచాల రాజేందర్ రావే  మైనస్ అంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ జోరుగా నడుస్తుంది. ప్రచారంలో భాగంగా నిర్వహించే సభల్లో తన పేలవమైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకోలేక పోతున్నాడన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ను ప్రజలు ఆలింగనం చేసుకుంటారని, రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేయడం ఖాయమని మాట్లాడిన మాటలు వీడియో వైరల్ గా మారిన విషయం విధితమే. దివంగత మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్లమెంట్ బరిలో నిలిచిన  వెలిచాల రాజేందర్ రావుకు తండ్రికి ఉన్న చరిష్మా కొడుక్కు లేదంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. వ్యాపారవెత్తగా సక్సెస్ ఆయన రాజేందర్ రావు రాజకీయాల్లో ఎలా రాణిస్తాడోనన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. స్థానికుడే అయినా స్థానికేతరుడని ఎన్నికల కోసమే వచ్చిన ప్యారాచూట్ లీడర్ అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, పార్లమెంట్ సెగ్మెంట్ లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించడం రాజేందర్ రావుకు కలిసివచ్చే అంశాలు. కరీంనగర్ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ కు దక్కితే అది పొన్నం ప్రభాకర్ శ్రమకు దక్కిన ఫలితమే అవుతుంది.