ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దాడి..

ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దాడి..
  • లైన్ లో రాకుండా నేరుగా బూత్ లోకి వెళ్లడంపై నిలదీసిన ఓటర్
  • ఆగ్రహంతో ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే శివకుమార్
  • వెంటనే ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన ఓటర్
  • ఓటర్ పై పిడిగుద్దులు కురిపించిన ఎమ్మెల్యే అనుచరులు

తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యం చేశారు. సామాన్య ఓటరుపై దాడి చేశారు. క్యూలో వెళ్లాలని సూచించడమే ఆ ఓటరు చేసిన నేరం.. తననే అడ్డుకుంటాడా అని కోపంతో మండిపడ్డ తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటరు చెంప చెళ్లుమనిపించాడు. సడెన్ గా జరిగిన ఈ సంఘటన నుంచి వెంటనే తేరుకున్న ఆ ఓటరు.. అదే స్పీడ్ తో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటిచ్చాడు. ఇది చూసి అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకి దిగారు. ఆ ఓటర్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పోలింగ్ బూత్ లో చోటుచేసుకుందీ ఘటన. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు. ఇది చూసి అక్కడ ఉన్న ఒక ఓటరు అభ్యంతరం చెప్పారు. అందరితో పాటు క్యూలో రావాలని సూచించారు. దీంతో ఆవేశానికి లోనైన ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటర్ పై చేయిచేసుకున్నారు. ఓటర్ తిరిగి కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు మూకుమ్మడిగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు.