రైలు దహనం కేసు నుంచి విముక్తి ఎప్పుడు?

రైలు దహనం కేసు నుంచి విముక్తి ఎప్పుడు?
kapu garjana sabha issue

కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన కాపు గర్జన సభ సందర్భంగా అప్పట్లో చెలరేగిన అల్లర్లుకు సంబంధించి కాపు నేతలను కేసులు వెంటాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 శాతం కేసులను కొట్టేసినా రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు దహనం కేసులు నీడలా వెంటాడుతున్నాయి. కాపు రిజర్వేషన్‌ పోరాట ఉద్యమంలో తుని రైల్వే స్టేషన్‌ వద్ద రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన సంఘటనకు సంబంధించి 41 మంది నిందితులపై విచారణ కొనసాగుతోంది. విజయవాడ రైల్వే కోర్టుకు ప్రతీ వారం ఈకేసులో నిందితులు హాజరవుతున్నారు. అయితే ఇప్పటివరకు 18 మంది పోలీసు అధికారుల సాక్ష్యాలను విన్న కోర్టు ఇక ఆనాటి రైలులో ఉన్న ప్యాసెంజర్ల సాక్షాలు వినాల్సి ఉంది.

రైలులో ప్రత్యక్ష సాక్షులుగా చెబుత్ను వారిని కోర్టుకు తీసుకువచ్చిన సాక్షాలను చెప్పించాల్సి ఉండగా దీనిపై రైల్వే పోలీలసులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధానంగా కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, వన్‌ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకర నాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకర రావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ తదితరులు ఉన్నారు.  కాపులను బీసీల్లో చేర్చాలన్న నినాదంతో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన బహిరంగ సభలో వేలాది మంది కాపులు పాల్గొన్నారు. సభ అనంతరం అక్కడ జరిగిన విధ్వంసంలో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే తుని రైల్వే స్టేషన్‌లో ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను కొందరు దహనం చేశారు.

ఈ సంఘటనలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దహనం అయ్యాయి. దీంతో అటు రైల్వే శాఖతోపాటు అప్పటి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం 329 కేసులు పలు సెక్షన్ల కింద నమోదు చేసింది. 2016 నుంచి 2019 వరకు దర్యాప్తులో 153 కేసులు వరకు వీగిపోయాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 176 కేసులుకుగానూ 161 కేసులను వెనక్కు తీసుకుంది. 14 కేసులపై మాత్రం కోర్టులో విచారణ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం 161 కేసులు వరకు ఎత్తివేసినా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖకు సంబంధించిన కేసుల్లో పలు సెక్షన్లు కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వీలు కాలేదు. అప్పటి నుంచి విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసులను విచారిస్తోంది. తుని రైలు దహనం కేసులకు సంబందించి నిందితులుగా ఉన్న పలువురు కాపు ఉద్యమ నాయకులు ప్రతీ వారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను ఎత్తి వేయగా రైల్వే చట్టం ద్వారా నమోదైన కేసులు మాత్రం విచారణ కొనసాగుతున్నాయి. దీంతో ప్రతీ వారం విజయవాడ రైల్వే కోర్టుకు నిందితులుగా ఉన్న  పలువురు కాపు ఉద్యమ నాయకులు హాజరుకావాల్సిన పరిస్థితి ఉంది.

ఆనాడు రైలు దహనం ఘటనలో ప్రతక్ష సాక్షులు, సీసీ కెమెరా పుటేజీలు, విూడియా ద్వారా వీడియోలు సేకరించిన రైల్వే పోలీసులు.. 1989, 1984 రైల్వే యాక్ట్‌ ప్రకారం పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబందించి ఆ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న వారిలో కొందరిని కూడా సాక్షులుగా చేర్చింది. ప్రస్తుతం ఆనాడు డ్యూటీలో ఉన్న అధికారులు, పోలీసుల సాక్షాలను విన్న కోర్టు త్వరలోనే ప్రత్యక్ష సాక్షులు అయిన ప్రయాణికుల సాక్షాలు వినాల్సి ఉంది. అయితే వారిని కోర్టు వరకు తీసుకురావడంపైనే రైల్వేశాఖ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా తుని రైలు దహనం సంఘటనకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులను దాదాపు ఎత్తివేసినప్పటికీ రైల్వే శాఖ ద్వారా నమోదైన కేసులు మాత్రం ఆనాడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కాపు ఉద్యమ నేతలను నీడలా వెంటాడుతున్నాయి.