సైకో. కిల్లర్ వరుస హత్యలు....!
- ఆధారాల్లేకుండా ఆరు హత్యలు
- మహిళల టార్గెట్. గా హత్యలు
- డబ్బుల కోసమే దారుణాలు
- వీడిన అడివిలో మహిళ హత్య మిస్టరీ
- నిందితుడిని జైలుకు పంపించిన పోలీసులు
- వరుస హత్యల నిందితుడి వివరాలు వెల్లడించిన
- వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్
ముద్ర ప్రతినిధి, వికారాబాద్: డబ్బుల కోసం దారుణాలకు తెగబడటం అతని నైజం. ఇందుకోసం ముఖ్యంగా మహిళలే టార్గెట్ గా ఎంచుకొని ఎలాంటి ఆధారాల్లేకుండా హత్యలు చేయడం అతని నైజం. ముఖ్యంగా అడ్డా కూలీ పనులు చేసే మహిళలనే టార్గెట్ చేసుకుని నిందితుడు తీవ్రమైన హత్యలకు పాల్పడ్డాడు. వరుసగా చేసిన ఆరు హత్య కేసుల్లో జైలుకు వెళ్లినా కిల్లింగ్ హాబిని మానుకోలేదు. 7వ హత్య కేసులో ఈ కిలాడీ కిల్లర్ ఆటకట్టించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీసులు. తాండూరు పట్టణంలో అదృశ్యమై హత్యకు గురైన మహిళ హత్యోదంతం మిస్టరీని పోలీసులు చేధించారు. శుక్రవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ధన్ గర్ గల్లి(పుటాన్ గల్లి) లో నివాసముండే సర్వాబీ(42) అడ్డా కూలీగా పనిచేస్తుండేది. గత నెల 29న ఇంటి నుంచి పనికోసం వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఈనెల ఒకటిన హతురాలి భర్త మహమూద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు విచారణ ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా స్వరాబీ అదృశ్యమైన రోజున ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప (55) అనే వ్యక్తి వెంట వెల్లినట్లు గుర్తించారు. పెద్దేముల్ మండలం
తట్టేపల్లి అడవిలో హత్య చేసినట్లు నిందితుడు కిష్టప్ప పోలీసులు విచారణ లో వెల్లడించడంతో సర్వాబీ హత్య ఉదంతం వెలుగు చూసింది. పెద్దముల్ మండలం తట్టేపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సర్వాబీని చీర కొంగుతోనే హత్య చేసి ఆమె వద్ద ఉన్న చైనాలు, మొబైల్ ఫోన్, రూ.వెయ్యి నగదును తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో సర్వాబీను అడవిలోనే హత్యచేసినట్లు నేరం అంగీకరించాడు.అడ్డా మహిళా కూలీలే టార్గెట్ గా. మహిళలను హత్య చేస్తూ సైకోగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానాలను వ్యక్తం చేశారు. గతంలో వికారాబాద్ పోలీస్టేషన్ పరిధిలో మూడు హత్యలు, యాలాల, ధార్, తాండూరు పోలీస్టేషన్లలో మొత్తం ఆరు హత్య కేసులు నమోదైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో 5 హత్య కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యలు చేయడంతో వాటిని కొట్టివేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేవలం చిల్లర ఖర్చుల కోసమే ఎంచుకున్న మహిళలను హత్య చేసి.. వారి వద్ద ఉన్న నగదు, వస్తువులను అపహరించుకోవడం అలవాటుగా చేసుకున్నట్లు తేలిందన్నారు. గత హత్య కేసుల్లో 2021 నుంచి 2023 వరకు రెండేళ్ల పాటు జైల్లో ఉన్నాడని, ఇటీవలే బయటకు వచ్చిన . కిష్టప్ప ఒక సైకోలాగా మారి హత్యలకు పాల్పడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. హంతకుడు కిష్టప్ప ఆధారాల్లేకుండా ఇంకా ఎన్నో హత్యలు చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
పక్కా ఆధారాలతో రిమాండ్
ఇదివరకు చేసిన ఆరు హత్యల్లో ఎలాంటి ఆధారాలు లేనప్పటికి ఈ సారి 7వ హత్య కింద చేసిన మహిళ హత్య కేసులో పక్కా ఆధారాలను సేకరించడం జరిగిందని డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. హంతకుడు మృతురాలిని వెంట తీసుకెళుతున్నట్లు సీసీ పుటేజీలతో పాటు హత్య చేసిన ప్రాంతాల వివరాలను అతని ద్వారానే పక్కాగా నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ ఆధారాలతో కోర్టులో హంతకుడిని జైలుకు రిమాండు పంపించనున్నట్లు తెలిపారు. హంతకుని దగ్గర నుండి మృతురాలి సెల్ ఫోన్, పట్ట గొలుసులతో పాటు రూ.వెయ్యి నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.