వీధి కుక్క దాడిలో చిన్నారి బాలికకు తీవ్ర గాయాలు

వీధి కుక్క దాడిలో చిన్నారి బాలికకు తీవ్ర గాయాలు

కేసముద్రం, ముద్ర: వీధి కుక్క దాడిలో ఏడేళ్ల వయసు గల చిన్నారి బాలిక తీవ్రంగా గాయపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దనసరి గ్రామ శివారు రేకుల తండాలో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బానోతు సురేష్ స్వరూప దంపతుల కుమార్తె అక్షితను వెంట తీసుకొని పొలం పనులకు వెళ్లారు. పొలం గట్టుపై అక్షితను కూర్చోబెట్టి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో వీధి కుక్క అక్కడికి వచ్చి అక్షితపై దాడి చేసింది. అక్షితను విచక్షణారహితంగా కరవడంతో  అక్షిత తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కుక్కను తరిమి అక్షితను చికిత్స కోసం మహబూబాబాద్ తీసుకెళ్లారు. ప్రస్తుతం గాయపడ్డ అక్షిత మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.