చంద్రబాబుపై వెనుక నుంచి రాయి విసిరి పారిపోయిన ఆగంతుకుడు

చంద్రబాబుపై వెనుక నుంచి రాయి విసిరి పారిపోయిన ఆగంతుకుడు
  • విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన
  • గాజువాకలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • వాహనం వెనుక నుంచి చంద్రబాబుపైకి రాయి విసిరిన ఆగంతుకుడు
  • రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు 

టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగిస్తుండగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్రజాగళం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబుపైకి రాయి విసిరి పారిపోయాడు. రాయి విసిరిన ఆగంతుకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. నిన్న సీఎం జగన్ పై చీకట్లో గులకరాయి పడిందని, ఇవాళ తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా అని హెచ్చరించారు. 

ఇవాళ తెనాలిలో పవన్ కల్యాణ్ పై కూడా చేతకాని పిరికిపందులు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు నాపై కూడా రాళ్లు వేశారు అని చంద్రబాబు వెల్లడించారు.  "నిన్న జగన్ సభ సమయంలో కరెంట్ పోయింది... సీఎం సభలో కరెంట్ పోతే ఎవరు బాధ్యత వహించాలి? జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయ్ హత్యను నాపైకి నెట్టాలని ప్రయత్నించారు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. కాగా, రాయి పడడంతో చంద్రబాబు ప్రసంగం ఆపారు. వాళ్లు దొరికితే తరిమి తరిమి కొడతారు అంటూ హెచ్చరించారు. పోలీసులు ప్రజాగళం వాహనం వెనుక వైపునకు వెళ్లి వెదుకుతుండగా, దొరికాడా లేదా అని చంద్రబాబు ఆడిగారు. క్లేమోర్ మైన్స్ కే భయపడలేదు... ఈ రాళ్లకు భయపడతానా? అని వ్యాఖ్యానించారు.