బుచ్చయ్య చౌదరి దారెటు?

బుచ్చయ్య చౌదరి దారెటు?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. తెలుగు దేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు. పలు పర్యాయాలు శాసన సభ్యునిగా, చాలాసార్లు మంత్రిగా పని చేసిన అనుభవజ్జ నాయకుడు. అప్పట్లో దివంగత నందమూరి తారక రామారావునకు అత్యంత ఆప్తుడు, తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అంతరంగికుడు. రాజమండ్రి రూరల్‌ నందు చక్రం తిప్పుతున్న నాయకుడు. గత రెండు పర్యాయాల నుంచి ఇదే నియోజకవర్గంలో టీడీపీ తరుపున పోటీ చేసి వరుస గెలుపును సాధిస్తున్న నాయకుడు. అంతటి పేరు ప్రఖ్యాతలున్న బుచ్చయ్య చౌదరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వయస్సు విూద పడటం, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ యువ నేత లోకేష్‌ ఆదేశాలు జారీ చేయడం, రాజమండ్రి రూరల్‌ స్థానం జనసేనకు కేటాయించే ఆలోచనలో ఉండటం, ఇటువంటివి బుచ్చయ్యను చుట్టుమట్టాయి. 2024 ఎన్నికల్లో కూడా బుచ్చయ్యకు పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నా అదిష్టానం మాత్రం సహకరించే యోచనలో లేదు. దీనికి తోడు రాజమండ్రి సిటీలో బుచ్చయ్య చాలా మంది నాయకులతో వైరం ఉండటంపెద్ద మైనస్‌గా చెబుతున్నారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీలో చురుకుగా ఉన్న బుచ్చయ్య చౌదరి తొలి నాళ్లలో రాజమండ్రి సిటీలో తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. చాలామార్లు శాసన సభ్యుడిగా గెలిచారు. పలుమార్లు మంత్రిగా కూడా పని చేశారు. టీడీపీలో పాత తరం నాయకుల్లో బుచ్చయ్య పేరు ప్రదమ వరుసలో ఉంటుంది. అదీగాక దివంగత నందమూరి తారక రామారావుతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 1995 ఆగస్టులో పార్టీ సంక్షోభంలో పడిన సమయంలో జిల్లాలో చాలా మంది నేతలు చంద్రబాబు వెంట వెళ్లగా బుచ్చయ్య మాత్రం నాడు నందమూరి తారక రామారావుతోనే ఉండిపోయారు. ఎన్టీఆర్‌ మరణించిన తర్వాత లక్ష్మీపార్వతీ వెంట ఉన్నారు. అలా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొన్నారు. కొంత కాలానికి చంద్రబాబు పంచన చేరారు. నాటి నుంచి టీడీపీలో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించారు. చంద్రబాబు కూడా బుచ్చయ్యకు రాజమండ్రి సిటీ సీటు ఇచ్చేవారు. మద్యలో రాజమండ్రికి చెందిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు విూద వైరంతో పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. దీంతో అప్పటి యంపీ మురళీ మోహన్‌ బుచ్చియ్యను అప్పటి యంపీ మురళీ మోహన్‌ బుజ్జగించారు. ప్రస్తుతం బుచ్చయ్య 2009లో సిటీ నుంచి గెలుపొందగా, 2014,2019లో రాజమండ్రి రూరల్‌ నుంచి వరుస గెలుపులు సాధిస్తూ వస్తున్నారు.

రాజమండ్రి సిటీ యంఎల్‌ఏ ఆదిరెడ్డి భవానీ అదే పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే శాసన సభ్యుడు బుచ్చయ్య చౌదరితో వైరం ఉంది. కేవలం భవానీతోనే కాకుండా ఆమె మామ ఆదిరెడ్డి అప్పారావు, భర్త వాసుతో కూడా వైరం ఉంది. దీంతో సిటీలో వీరిద్దరి మధ్య నిప్పు, ఉప్పుగా వైరం నడస్తుంది. దీంతో బుచ్చయ్య వర్గం ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్యకు సీటు ఇస్తే భవానీ వర్గం మద్దతు ఇచ్చేలా లేదు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి అధినేత చంద్రబాబు చాలామార్లు ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో రోజు రోజుకు వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి.2024 ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరికి సీటు ఇచ్చే ఆలోచన లేనట్లు సమాచారం. రాజమండ్రి రూరల్‌ స్థానం మిత్ర పక్షంలో భాగంగా జనసేకు కేటాయిస్తారని తెలుస్తోంది. అక్కడ జనసేన ఇంఛార్జి కందుల దుర్గేష్‌ పోటీ చేయనున్నట్లు సమాచారం. దీంతో బుచ్చయ్యకు రూరల్‌లో సలాం చెప్పే యోచనలో అధిష్టానం ఉంది. ఇక సిటీ విషయానికి వస్తే బుచ్చయ్యకు ఎంతమాత్రం స్థానం లేదు. ఎంఎల్‌ఏ ఆదిరెడ్డి భవానీ భర్త వాసు బీసీ కోటాలో సీటు కావాలని పట్టు పడుతున్నారు. అదీగాక యువ నాయకుడు, దీనికి తోడు అతను దివంగత ఎర్రం నాయుడు అల్లుడు అవ్వడంతో సీటు సాధించుకోవడానికి వాసుకు అన్ని అర్హతలు ఉన్నట్లు సమాచారం. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.