భద్రాచలం రాముని సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం.
- బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వలేదు..
- కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలించకపోయారు..
- ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు..
- ఢిల్లీలో మోడీకి ఫార్మ్ హౌస్ లో కేడీకి గుణపాఠం నేర్పుదాం..
- మహబూబాబాద్ జనజాతరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మహబూబాబాద్: అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని, రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమపథకాలను ప్రజలకు అందజేస్తామని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతరలో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం రాముని సాక్షిగా సోనియమ్మ మాటగా.., రాహుల్ గాంధీ మాటగా.., అందరికీ మాట ఇస్తున్న ఆగస్టు 15వ తేదీ లోగా రెండులక్షల రూపాయల రుణమాఫీని ప్రతి రైతుకు అమలు చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో మోడీ, ఫామ్ హౌస్ లో కేడి పదిసంవత్సరాలు పాలించి చేసింది శూన్యం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ, పాంహౌజ్ కేడీ చీకటి ఒప్పందం చేసుకొన్నారని, కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని పార్లమెంట్ సీట్లలో రహస్య ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఉన్న బిడ్డను కాపాడుకోవడం కోసం కేడి కొత్తనాటకాలు ప్రారంభించాడన్నారు. గ్యారంటీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం పడిపోతుందని, ముఖ్యమంత్రి దిగిపోతాడని కేడి బ్యాచ్ ప్రచారం చేస్తున్నారని, అయ్య పేరు చెప్పుకొని, తాత పేరు చెప్పుకొని, వాని..వీని కాళ్లు పట్టుకొని అధికారంలోకి రాలేదని, మీలాంటి సన్నాసులను తొక్కుకుంటా..తొక్కుకుంటా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ..సీట్లో కూర్చోబెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు.
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వని బిజెపికి మహబూబాబాద్ పార్లమెంట్ లో ఓటు అడిగే కనీస హక్కు కూడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం జాతరకు ముష్టి మూడు కోట్లు ఇచ్చిన బిజెపి ఏ..మొహం పెట్టుకొని మహబూబాబాద్ పార్లమెంట్ లో ఓట్లు అడుగుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీ గొప్ప మనసుతో గిరిజన యూనివర్సిటీ ములుగు నియోజకవర్గానికి మంజూరు చేస్తే పదిసంవత్సరాలు పక్కనపెట్టి ఎంతోమంది విద్యావంతుల జీవితాల్లో చీకట్లు కమ్మేలా చేసిన బిజెపి ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో బిజెపికి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాజీపేటకు సోనియమ్మ కోచ్ ప్యాక్టరీ ఇస్తే.. మోడీ లాథూర్ కు తరలించుకపోయాడని విమర్శించారు. ఐటిఐఆర్ కారిడార్ కావచ్చు, మెట్రోరైలు కావచ్చు, మూసినది అభివృద్ధి కావచ్చు, పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతలే కావచ్చు ఇలా ఏ..ప్రాజెక్ట్ అయినా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. నరేంద్రమోడీ పార్లమెంట్ లో మాట్లాడుతూ తల్లిని చంపి, బిడ్డను బ్రతికించారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించాడు. తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు.. తెలంగాణ రాష్ట్రం వద్దే..వద్దని ప్రదానమంత్రి మోడీ అన్నారు. సిగ్గులేని కిషన్ రెడ్డి ని అడుగుతున్న తెలంగాణరాష్ట్రమే వద్దన్న మీరు ఏ..మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని రేవంత్ రెడ్డి అన్నారు.
సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు కారు గుర్తుకే ఓటు వేస్తున్నారని ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని మీరంతా గత ఎన్నికల్లో నిరూపించారు, ఈ..ప్రాంతానికి చెందిన తండ్రిని అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి పంపారు, పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డను కూడా ఇంటికి పంపి బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియమ్మ బిడ్డ ప్రధానమంత్రి కాబోతున్నడు.. 14మంది యంపిలను గెలిపించుకొని డిల్లీకి పంపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలమైన మనపై లేదా అని రేవంత్ రెడ్డి అన్నారు. వందరోజుల పాలనలో ఆర్టీసీ ఉచితప్రయాణం చూడండి, ఐదువందలకే గ్యాస్ చూడండి, ఉచితవిద్యుత్ చూడండి, ఆరోగ్యశ్రీ పెంపు చూడండి, ఇందిరమ్మ ఇండ్లు చూడండి, మేమిచ్చిన 30వేల ఉద్యోగాలను చూడండి, మేము చేయబోయే రెండులక్షల రూపాయల రుణమాఫీ చూడండి, ఇవ్వబోతున్న దాన్యానికి రూ.500 బోనస్ చూడండి.. ఇవ్వన్నీ మేము చేస్తున్నాం.. మిమ్మల్ని ఒక్క ఓటు అడుగుతున్నాం.. ఈసారి మీ..ఓటు బలరాంనాయక్ కు వేయండి.
మొదటిసారి యంపిగా గెలిస్తేనే బలరాంనాయక్ ను సోనియమ్మ కేంద్రమంత్రి ని చేసింది, రెండవసారి గెలిస్తే ఏమవుతాడో ఆలోచించండి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో బలరాంనాయక్ ను గెలిపించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అద్యక్షతన జరిగిన ఈ..కాంగ్రెస్ జనజాతరలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, యంపి అభ్యర్థి బలరాంనాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ రామచంద్రునాయక్, యశస్వినిరెడ్డి, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, ఘనపురపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.