ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కాషాయ జెండానే

ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కాషాయ జెండానే
  • ఉద్యమ పార్టీ పేరుతో రాష్ట్రాన్ని దోచేసిన బిఆర్ఎస్
  • అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
  • బీజీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాషాయ జండా ఎగరటం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ పార్టీ పేరుతో అధికారులకు వచ్చిన బిఆర్ఎస్ తమ పదేళ్ల పాలనలో కుటుంబ పాలన సాగిస్తూ అవినీతికి కేరాఫ్ గా నిలిచిందన్నారు. అమలు గాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. నమ్మి నానాబోస్తే పుచ్చిబూరెలైనట్లు కాంగ్రెస్ నాయకుల పాలన ఉందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే అసలు బండారం బయటపడిందని అన్నారు.


మాట ఇచ్చినట్లుగా హామీలు అమలు చేయాలంటే, ప్రతీ హామీకి నిధులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీల అమలుపై జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. 412 హామీలు కాదు కదా, కనీసం వారు అనుకుంటున్న ఆరు హామీలకు కూడా నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు వారంటీలతోనే కాలం వెళ్లబుచ్చుతుందని అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ, అడవిబిడ్డల నేల ఖమ్మం జిల్లా అని చైతన్యవంతులైన జిల్లా ప్రజలు కాంగ్రెస్ పాలనను పరిశీలిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా, గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరి వాస్తవాలు బయటపట్టే వరకు , ప్రజలపక్షంగా ప్రతిపక్షంగా బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, మళ్లీ లోక్ సభ ఎన్నికల ముందు మళ్లీ మీ ఇండ్ల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుకులకుబిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో నాయకులు ప్రేమేందర్ రెడ్డి , బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగా కిరణ్ , ఆకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.