ప్రధానమంత్రి మోదీ పర్యటనను విజయవంతం చేయాలి

ప్రధానమంత్రి మోదీ పర్యటనను విజయవంతం చేయాలి

బీజేపీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు డాక్టర్ రఘు
మెట్‌పల్లి ముద్ర : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఈనెల 3న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా ఆయన పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు డాక్టర్ రఘు కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈసారి తెలంగాణలో రూ. 21,500 కోట్ల పనులు ప్రారంభం కానున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణలో అనేక అభివృద్ధి పనులకు రూ. 9 లక్షల కోట్లను ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి వస్తే హాజరుకాని కేసీఆర్ కు సీఎంగా ఉండే నైతిక హక్కులేదన్నారు. 

కాగా నిజామాబాద్ నుంచి రామగుండంలోని ఎన్టీపీసీలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తెలంగాణ ప్రజలకు అంకితం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. అదే విధంగా తెలంగాణలోని 20 జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మిషన్లో భాగంగా రూ.516.5 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లకు శంకుస్థాపన చేశామని, బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయాన్ని మననం చేసుకోవాలని సూచించారు. రూ.305 కోట్లతో విద్యుదీకరణ పూర్తయిన ధర్మాబాద్ - మనోహరాబాద్ రైల్వే లైన్ జాతికి అంకితం చేశారని, మనోహరాబాద్-సిద్ది పేట కొత్త రైల్వేలైన్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ఈనెల 3న కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.