ఏపీలో జర్నలిస్టుల మేనిఫెస్టో

ఏపీలో జర్నలిస్టుల మేనిఫెస్టో

అన్ని పక్షాల నేతలకూ అందజేసిన ఏపీయూడబ్ల్యూజే

అమరావతి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని , అందుకోసం జర్నలిస్ట్ మానిఫెస్టో ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏ.పి.యు. డబ్ల్యు.జే.)  వివిధ రాజకీయ పక్షాల అగ్రనేతలకు విజ్ఞప్తి చేసింది. ఆమేరకు యూనియన్ రాష్ట్ర నాయకత్వబృందం సోమవారం వివిధ రాజకీయపక్షాల అగ్ర నాయకులను కలిసి ఏ.పి.యు.డబ్ల్యు.జే. రూపొందించిన 15 అంశాలతో కూడిన "జర్నలిస్ట్ మానిఫెస్టో"  ను అందచేసింది. జర్నలిస్టుల సమస్యలను వివరించింది.అక్రెడిటేషన్ నిబంధనలను సరళతరం చేయాలని, గతంలో అమల్లో ఉన్న హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రమాద బీమా పథకం తిరిగి ప్రవేశ పెట్టాలని, ఇళ్ళస్థలాల జీవోను మార్చి సీనియారిటీ ప్రాతిపదికన నామ మాత్రపు ధరకు స్థలాలు ఇవ్వాలని, గతంలో ఉన్న ప్రొఫెషనల్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయాలని , సంక్షేమ నిధిని పునరుద్ధరించాలని , ప్రెస్ అకాడమీకి నిధులు ఇచ్చి పనిచేయించాలని , రైల్వే ప్రయాణ రాయితీని కొనసాగించాలని, పాత్రికేయులకు పింఛను ఇవ్వాలని , ఉత్తమ జర్నలిస్ట్ ల అవార్డులను తిరిగి ప్రారంభించాలని యూనియన్ కోరింది. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో జర్నలిస్ట్ మానిఫెస్టో ను కూడా  ప్రకటించాలని కోరింది.

యూనియన్ ప్రతినిధి బృందం తొలుత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ ను జనసేన రాష్ట్ర కార్యాలయంలో కలిసింది.యూనియన్ అందచేసిన  జర్నలిస్ట్ మానిఫెస్టో ను ఆయన చదివారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కట్టుబడి ఉందని   మనోహర్ అన్నారు. గతంలో కూడా వర్కింగ్ జర్నలిస్ట్స్  యూనియన్  సమస్యల పరిష్కారానికి ఉద్యమించినపుడు పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొని మద్దతు ఇచ్చిన సంగతిని మనోహర్ గుర్తు చేశారు. తప్పనిసరిగా తమ కూటమి అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల సంక్షేమానికి, హక్కుల కోసం అండగా ఉంటామని మనోహర్ హామీ ఇచ్చారు. 

అనంతరం యూనియన్ ప్రతినిధి బృందం  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను  ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసింది.జర్నలిస్ట్ మానిఫెస్టో ను చంద్రబాబు పరిశీలించారు. జర్నలిస్టులకు  గతంలో అమల్లో ఉండి , ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రద్దయిన అన్ని పథకాలను తిరిగి అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  జర్నలిస్టులు చేస్తున్న  పోరాటాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము అధికారం లోకి వచ్చాక జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేస్తామని యూనియన్ నాయకత్వానికి ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం యూనియన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారుడు సజ్జల రామ కృష్ణారెడ్డి ని  ప్రజా విధానాల సలహాదారుడు నేమాని భాస్కర్ ను కలిసింది. ఈ సందర్భంగా సజ్జల రామ కృష్ణారెడ్డి యూనియన్ నాయకులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం సుమారు 11 వేల మందికి ఇళ్ళస్థలాలు ఇస్తున్నదని , త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.
మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అన్నారు. సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వాన్ని అభినందించాల్సిన బాధ్యత ఏ.పి.యు.డబ్ల్యు.జే. వంటి చరిత్ర కలిగిన సంస్థపై ఉందని అన్నారు. జర్నలిస్ట్ మానిఫెస్టో ను పరిశీలిస్తామని , ఆయన అన్నారు.

యూనియన్ నాయకత్వ బృందం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి  కార్యాలయం ఇన్ ఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి ని కలిసి "జర్నలిస్ట్ మానిఫెస్టో" ను అందచేసింది. , జర్నలిస్టుల సమస్యలను ఆయనకు వివరించింది. కార్యక్రమంలో ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, రాష్ట్ర  ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్, ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.జయరాజు,  ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ , సామ్నా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సి హెచ్ .రమణారెడ్డి, యూనియన్ విజయవాడ అర్బన్ కమిటీ అధ్యక్షుడు చావా రవి, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి డి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.