'అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తా'
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందుస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఒకవేళ వివేకా కూతురు సునీతారెడ్డి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే.. తాను వెళ్తానని వెల్లడించారు. గత ఎన్నికల్లో వివేకా హత్యపై సానుభూతి పొంది జగన్ అధికారంలోకి వచ్చారని, తమ పార్టీపై ఆరోపణలు చేయడం వల్ల టీడీపీకి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. తమ పార్టీకి నష్టం జరిగినందున వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు తాను వెళ్లి తీరుతానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని, శిక్ష పడాల్సిందేనని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాధ్‌పై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. బయ్యవరంలో అమర్‌నాథ్ ఎస్సీ భూములు దోచుకున్నారని, 600 ఎకరాల్లో లే అవుట్ వేశారని ఆరోపించారు. వైసీపీ నేతల భూదోపిడీని తాను అధారాలతో సహా నిరూపిస్తానని, వైసీపీ నేతలు చర్చకు సిద్దమా? అంటూ సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల భూకబ్జాలపై విచారణ చేపడతామన్నారు.