Udayagiri MLA Vs Ycp Leaders ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి

Udayagiri MLA Vs Ycp Leaders ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వైకాపా నేతలకు సవాల్‌ విసిరారు. ఉదయగిరికి వస్తే తరిమికొడతామన్న వాళ్లు రావాలంటూ పట్టణంలోని బస్టాండ్‌ సెంటరులో కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు. అక్కడికి ఎమ్మెల్యే అనుచరులు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని వైకాపా అధిష్ఠానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. దీంతో అప్పటి నుంచి వైకాపా నేతలు మేకపాటిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈక్రమంలో మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరించారు. పార్టీ ద్రోహి మేకపాటి నియోజకవర్గం నుంచి వెళ్లిపో అంటూ ప్లకార్డులతో గురువారం ఉదయం ఉదయగిరిలో ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మేకపాటి మర్రిపాడు నుంచి ఉదయగిరి చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా, అయినా పార్టీ అధిష్ఠానం తనపై అభాండాలు వేసి సస్పెండ్‌ చేసిందని తెలిపారు. పార్టీలో లేనని చెప్పి కొందరు నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఆదరించడం వల్లే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని స్పష్టం చేశారు. ఎవరొస్తారో రండి.. తరిమికొట్టండి అని సవాల్‌ విసిరారు. అనంతరం బస్టాండు సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు. దీంతో ఉదయగిరిలో ఉద్రిక్తత నెలకొంది.