సమస్యలు పరిష్కరిస్తే ముఖ్యమంత్రికి పూలమాల వేస్తా : ఎమ్మెల్యే కోటంరెడ్డి

సమస్యలు పరిష్కరిస్తే ముఖ్యమంత్రికి పూలమాల వేస్తా : ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు:  అనేక సార్లు జిల్లా సమావేశాల్లో సమస్యలపై మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలుపై మాట్లాడానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్నుచూపను.. మడిమ తిప్పను. భయపడను.. ఎంతటి వారినైనా ఎదుర్కొంటానని చెప్పారు. నెల్లూరు మాగుంట లే అవుట్ లోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ‘నిరసన గొంతుక’ కార్యక్రమం ప్రారంభంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కరిస్తే ముఖ్యమంత్రికి పులమాల వేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయన్నారు.  డ్రైన్ లు లేవు.. విద్యుత్ సౌకర్యం సరిగా లేదని చెప్పారు. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని ఒకటిన్నర సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ములుముడు వంతెన రోడ్లకు రూ.28 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కానీ కార్యరూపం దాల్చలేదని.. ఇది ఎక్కడి న్యాయం అని అన్నారు. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగానని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ రూ.2 కోట్లు ఖర్చు పెట్టారని.. ఇంత వరకు బిల్లులు ఇవ్వలేదని.. పరిస్థితి అరణ్య రోదనగా మారిందన్నారు.  కొమ్మరపూడి రైతుల పరిహారం ఇవ్వాలని 50సార్లు అడిగా ఫలితం లేదని విమర్శించారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మించాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరామని గుర్తు చేశారు. దళిత బిడ్డలకు ఎంతో ఉపయోగమని చెప్పా.. పరిష్కారం చేయలేదన్నారు. సమస్యలపై అడిగితే, ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొన్నారు. నమ్మకం లేని చోట, అనుమానించిన చోట ఉండకూడదని అనుకున్నానని తెలిపారు.